తెలంగాణపై తేల్చకుండా ప్రధాని రావొద్దు టీ అడ్వకేట్ జేఏసీ నిరసన
తెలంగాణపై తేల్చకుండా ప్రధాని రావొద్దు
టీ అడ్వకేట్ జేఏసీ
హైదరాబాద్, అక్టోబర్ 7 : తెలంగాణ అంశాన్ని పరిష్కరించాకే ప్రధాని హైదరాబాద్‌కు రావాలని తెలంగాణ అడ్డకేట్ జేఏసీ డిమాండ్ చేసింది. ఆదివారం ర్యాలీగా గన్‌పార్క్‌కు చేరుకున్న అడ్వకేట్ జేఏసీ నాయకులు అక్కడ తెలంగాణ అమర వీరులకు నివాళులర్పించారు. అనంతరం వారు గన్‌పార్క్ వద్ద ధర్నా నిర్వహించి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లాయర్లు మాట్లాడుతూ తెలంగాణ కోసం వెయ్యి మందికి పైగా యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నా, ప్రధానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. తెలంగాణ ఇస్తామని అధికారంలోకి వచ్చిన ఆయన ఆ తర్వాత ఆ విషయాన్నే మరిచారన్నారు. ఓ పక్క తెలంగాణ కోసం ఉద్యమాలు సాగుతూ మనుషులు చనిపోతుంటే, మరో వైపు ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెట్టి జంతువులు, కీటకాల కోసం జీవ వైవిధ్య సదస్సు నిర్వహించడం శోచనీయమన్నారు. ఒక రకంగా ఈ సదస్సు నిర్వహణ తెలంగాణ ప్రజలను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. ప్రధాని తెలంగాణపై స్పష్టమై ప్రకటన చేశాకే హైదరాబాద్‌కు రావాలని జేఏసీ నాయకులు పునరుద్ఘాటించారు. లేకుంటే, జేఏసీ తరుపున నిరసన కార్యక్రమాలు తెలుపుతామని హెచ్చరించారు.