తెలంగాణపై విషం చిముతున్న 12 ఫార్మా కంపెనీల ముసివేతకు ఆదేశాలు
హైదరాబాద్, జూలై 12 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల భూములు, పొలాలు, నీళ్లు, పచ్చదనం, ఉపాధి కొల్లగొట్టి ఇంతకాలం తమ బ్యాంకు బ్యాలెన్సులు పెంచుకుని, ఇక్కడి ప్రజల జీవితాలను కొల్లగొట్టడంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సెజ్‌ల పేరుతో ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటైన ఫార్మా కంపెనీలది ప్రధాన స్థానం. అలాంటి 12 ఫార్మా కంపెనీలపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కొరడా ఝుళిపించింది. పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తూ, ప్రజల జీవన వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని ఆ సంస్థలను వెంటనే మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. నిబంధనలు పాటించకుండా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, మందులను ఉత్పత్తి చేస్తూ, జనావాసాల్లోకి రసాయనాలను విడుదల చేస్తున్న ఫార్మా సంస్థలపై కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ కంపెనీలన్నీ తెలంగాణలోనే ఉండడం గమనార్హం. మెదక్, రంగారెడ్డి జిల్లాలతోపాటు హైదరాబాద్ శివార్లలో ఉన్న సదరు 12 కంపెనీలు వెంటనే తమ ఉత్పత్తులను నిలిపివేసి, గేట్లకు తాళాలు వేసి సంస్థలను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలను ఉత్పత్తి చేస్తున్నాయని పేర్కొంది. ప్రఖ్యాత ఫార్మా కంపెనీలైన కోవాలెంట్, డీబీస్, శ్రీకృష్ణా, ఇనోజెంట్, ఎస్‌ఎంఎస్, కైరెక్స్, హెటిరో డ్రగ్స్-4, అరబిందో-2 పీసీబీ ఆగ్రహానికి గురైన 12 కంపెనీల్లో ఉన్నాయి. ఇదిలా ఉండగా, కాలుష్య నియంత్రణ మండలి తీసుకున్న ఈ నిర్ణయంతో కంపెనీలున్న మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ శివారు ప్రాంతాల ప్రజలతోపాటు తెలంగాణ ప్రజలు, తెలంగాణవాదులు, మేధావులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.