తెలంగాణపై సరైన నిర్ణయం ప్రకటించాలి
కరీంనగర్, ఫిబ్రవరి 1 (): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు 60 సంవత్సరాలుగా పోరాడుతున్నా చివరకు రాష్ట్రం ఏర్పాటు సమయంలో సీమాంధ్ర నేతలు అడ్డుపడుతున్నారని టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు జి.భాస్కర్‌రెడ్డి విమర్శించారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సమస్య పరిష్కరించకుండ కేంద్రం నాన్చుడు ధోరణి వ్యవహరిస్తుందని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకొని ప్రజలతో ఆటలాడుతోందని విమర్శించారు. టిఆర్‌ఎస్ ఎక్కడ సమావేశాలు జరిపినా టిడిపి తెలంగాణపై సరైన అభిప్రాయం తెలపడం లేదని విమర్శిస్తున్నారని, తమ పార్టీ ఎప్పుడో తెలంగాణపై వివరణ ఇచ్చిందని, మాటిమాటికి అభిప్రాయం చెప్పాలని అనడం సరైందిగా లేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంతంలో సర్వేలు నిర్వహించారని, అఖిలపక్ష సమావేశంలో తమ అభిప్రాయాలను వెల్లడించామని అన్నారు. కేంద్రం తెలంగాణపై ఓ నిర్ణయానికి వస్తున్న సమయంలో కొందరు మూడు రాష్ట్రాలు ఏర్పడాలని, మరికొందరు హైదరాబాద్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలంటూ మాట్లాడడం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం ఆలోచించి తెలంగాణపై సరైన నిర్ణయం తీసుకోవాలని భాస్కర్‌రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో రాంరెడ్డి, శంకర్‌రెడ్డి, గుండయ్య, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.