తెలంగాణలో అస్తవ్యస్థ పాలన: రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అస్తవ్యస్థ పాలన కొనసాగుతోందని తెలంగాణ తెదేపా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, విద్యార్థులు, నిరుద్యోగులు నిరాశలో కూరుకుపోతున్నారని ఆరోపించారు. ఈరోజు కరీంనగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశించారని… ఆ ఆశలన్నీ ప్రభుత్వం వమ్ము చేస్తోందన్నారు. రోజుల తరబడి ఆందోళన చేస్తున్నా ఆశా కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేందుకు ముందుకు రావడం లేదన్నారు. అన్ని వర్గాల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కలుగుతోందన్నారు. కరీంనగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు