తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు.. అధికార యంత్రాంగం అప్రమత్తం

రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్‌-ఉత్తర ఒడిశా తీరాల్లో కొనసాగుతున్నదని తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్యం దిశగా కదులుతూ రాగ ల 2 నుంచి 3 రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ మీదుగా వెళ్లే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.

దిగువ స్థాయిలోని గాలులు పశ్చి మ, వాయవ్య దిశల నుంచి రాష్ట్రంలోకి వీస్తున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్‌తోపాటు నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.