తెలంగాణ అంశం పేరుతో – ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్‌ : బాబు ఆరోపణ

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 8: కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అంశాన్ని వాడుకుంటు ప్రజలను మోసగిస్తూ రాజకీయాలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా మూడువ రోజు శనివారం భైంసాలో పాఠశాల విద్యార్థులతో ముఖాముఖిగా ముచ్చటించారు. విద్యార్థులు తెలంగాణ అంశం, ఇతర విషయాలపై ప్రశ్నలు కురిపించిన నేపథ్యంలో బాబు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఏనాడు తెలంగాణకు వ్యతిరేకం కాదని అనేక మార్లు చెప్పడం జరిగిందన్నారు. మళ్లీ కాంగ్రెస్‌ అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను అడగడం ప్రజలను మరోసారి మోసగించడమేనన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను ముందుఉంచిన ఘనత తమదేనన్నారు. ప్రజలను మోసగించడంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆరి తేరారని దుయ్యబట్టారు. తాము అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన ప్రజా సంక్షేమం పథకాలు, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాల గురించి ఏకరువు  పెట్టారు. రాజకీయంగా తమను ఎదుర్కొలేకనే అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలో వస్తే రైతు రుణ మాఫీతో పాటు 7గంటల విద్యుత్‌ సరఫరా, నిరుద్యో భృతి, విద్యార్థులకు ఉన్నత చదువులు చదివేందుకు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌ రాథోడ్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నగేష్‌తో పాటు నాయకులు పాల్గొన్నారు.