తెలంగాణ ఇచ్చింది సోనియానే..

` హామీ మేరకు మాట నిలబెట్టుకున్నాం
` పదేళ్ల పాలనను.. ఏడాది పాలనను పోల్చి చూడాలి
` ప్రతిపక్షాల చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి
` రాష్ట్ర ప్రజల ఆశీస్సులతోనే సామాన్యుడినైన నేను సీఎం అయ్యాను
` కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులు కులగణనలో పాల్గొనలేదు.. వారు బీసీ వ్యతిరేకులా?
` ఉద్యోగాల హామీపై మోదీ, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు మాట్లాడాలి
` పెద్దపల్లిలో జరిగిన యువవికాసం సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
` గ్రూప్‌`4, సింగరేణి ఉద్యోగాలకు ఎంపికైనవారికి నియామక పత్రాలు అందజేత
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ ఇస్తామని సోనియా మెదట పెద్దపల్లి గడ్డ పైనుంచే చెప్పారని, ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల ఆశీస్సులతోనే సామాన్యుడినైన తాను సీఎం అయ్యారని తెలిపారు. తెలంగాణ తెచ్చుకున్నది ఉద్యోగాల కోసమేనని, దాని కోసమే ఖమ్మం జిల్లా పాల్వంచలో మొదట ఉద్యమం మొదలైందని గుర్తుచేశారు. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా రాజ్యం.. రాష్ట్రంగా మారిందని వ్యాఖ్యానించారు. బుధవారం పెద్దపల్లిలో జరిగిన యువవికాసం సభలో ఆయన పాల్గొని గ్రూప్‌`4, సింగరేణి ఉద్యోగాలకు ఎంపికైనవారికి నియామక పత్రాలను అందజేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలను, సీఎం కప్‌ ట్రోఫీని ఆవిష్కరించారు.పెద్దపల్లి జిల్లాలో రూ.వందల కోట్ల పనులు పూర్తి చేసుకున్నామని సీఎం రేవంత్‌ తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు తమను బెదిరించి పనులు చేయించుకున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పాలనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పదేళ్ల పాలనను.. ఏడాది పాలనను పోల్చి చూడాలని విజ్ఞప్తి చేస్తున్నామని కోరారు. ప్రతిపక్షాల చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే అత్యధికంగా వడ్లు పండిస్తున్న జిల్లా పెద్దపల్లి అని? అన్నారు. ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. మోదీ సీఎం, పీఎంగా ఉంటూ గుజరాత్‌లో ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఉద్యోగాలపై మాట్లాడాలని మోదీ, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వడ్లు పండిరచమని చెప్పామని, అందుకే మద్దతు ధర, బోనస్‌ ఇస్తున్నామని సీఎం చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత ఆడబిడ్డల కళ్లలో సంతోషం చూశానని వ్యాఖ్యానించారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామని పేర్కొన్నారు. కోటి మంది ఆడబిడ్డలు ఓటేస్తే మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శాతవాహన వర్సిటీకి ఇంజినీరింగ్‌, లా కాలేజీలు మంజూరు చేస్తామని ప్రకటించారు.ప్రభుత్వం ఒక్కరోజులోనే అద్భుతాలు సృష్టిస్తుందా ? సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఏ పని చేయాలన్నా విధివిధానాలు ఉంటాయని పేర్కొన్నారు. పదేళ్లు పాలించారని, పది నెలలైనా ఆగలేరా? అన్నారు. కేసీఆర్‌ శాసనసభకు రావాలని, తన మేధావితనాన్ని ప్రజలకు పంచాలని ఉద్ఘాటించారు. ఎకరంలో కోటి రూపాయల పంట ఎలా పండిరచారో కేసీఆర్‌ రైతులకు చెప్పాలని సీఎం డిమాండ్‌? చేశారు. కులగణనలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు పాల్గొనట్లేదని, వారు బీసీ వ్యతిరేకులా? అని నిలదీశారు.
ఉద్యోగాలకు ఎంపికైనవారికి నియామక పత్రాల ప్రదానం
గ్రూప్‌`4, సింగరేణి ఉద్యోగాలకు ఎంపికైనవారికి నియామక పత్రాలను సీఎం అందజేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలను, సీఎం కప్‌ ట్రోఫీని ఆవిష్కరించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సభలో పాల్గొన్నారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
జిల్లా పరిధిలో చేపట్టే రూ.1000 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. 82 కోట్ల రూపాయలతో నిర్మించే పెద్దపల్లి బైపాస్‌ రోడ్డు, సుల్తానాబాద్‌ బైపాస్‌ రోడ్ల నిర్మాణాలకు, జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో స్వశక్తి మహిళా ప్రాంగణం భవన నిర్మాణానికి, రామగుండం నియోజకవర్గంలో రూ. 60 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్మాణ పనులకు, మంథనిలో ఆర్‌అండ్‌బీ పెండిరగ్‌ రోడ్ల పూర్తికి, రూ. 10 కోట్లతో అంతర్గాంలో, మంథని గంగపురిలో, పోతారం గ్రామంలో 33/11 కేవీ సబ్‌ స్టషన్ల నిర్మాణ పనులకు, అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లిలో బండ్లవాగు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను ప్రారంభించారు.జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని, రామగుండం మున్సిపాలిటీల పరిధిలో రూ. 51కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు, ఓదెల మండలం రూపునారాయణపేట వద్ద మానేరు నదిపై హైలెవల్‌ వంతెన నిర్మాణానికి రూ. 80 కోట్లతో చేపట్టే పనులకు, కాల్వశ్రీరాంపూర్‌ నుంచి మొట్లపల్లి రూ.25కోట్లతో, పీడబ్ల్యు రోడ్‌ నుంచి ఎల్లంపల్లి వరకు రూ.7కోట్లతో రోడ్ల నిర్మాణాలకు, రూ.6 కోట్లతో గర్రెపల్లి నుంచి ఎలిగేడు వరకు రహదారి విస్తరణ, రూ.5 కోట్లతో హుస్సేన్‌ మియా వాగుపై హైలెవల్‌ వంతెన నిర్మాణానికి, రూ. 12 కోట్లతో సుగ్లాంపల్లి నుంచి ధూళికట్ట వరకు రహదారి విస్తరణ పనులకు, రామగుండంలో రూ. 60 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
మంథనిలో బ్రిడ్జి, రోడ్ల నిర్మాణానికి, మంథని ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేసే పనులను ప్రారంభించారు. 2.45 కోట్ల రూపాయలతో నిర్మించే గుంజపడుగులో 30 పడకల ఆస్పత్రికి, పెద్దపల్లి 50 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేసే పనులను ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణానికి, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ రోడ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.