తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత

మంత్రి సబితాఇంద్రారెడ్డి
హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) :
తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయం లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసిన అనంతరం ఈమేరకు మీడియాతో మాట్లాడారు. నల్గొండ జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై పెట్టిన కేసుల ఎత్తివేతకు 35 జీవోలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థులు, యువకులతో పాటు వివిధ వర్గాల ప్రజలు చురుకుగా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో వారిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులు ఎత్తివేయాలని కోరుతూ అధికారపార్టీ అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సబిత శాంతి భద్రతల సమస్యలపై, ప్రభుత్వం హైదరాబాద్‌లో భద్రతపై చర్చించినట్లు సమాచారం.