తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగిస్తున్న ధూంధాం
22న దశాబ్ది ఉత్సవాలు
విజయవంతం చేయాలని కోదండరామ్ పిలుపు
హైదరాబాద్, డిసెంబర్ 11 (జనంసాక్షి) :తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కోసం చేపట్టిన ఉద్యమాన్ని ధూంధాం కార్యక్రమాన్ని ఉర్రూతలూగించిందని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన ధూంధాం దశాబ్ది ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, ఉద్యమ నిర్మాణంలో ప్రజలకు దారి చూపేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడిందన్నారు. పది జిల్లాల్లో గ్రామగ్రామాన కళాకారులు గజ్జెకట్టి గళమెత్తారని తెలిపారు. వారి ఆటపాటలతోనే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, సీమాంధ్ర పాలకుల దోపిడీ విధానాలు ప్రజల్లోకి ఎక్కువగా చొచ్చుకెళ్లాయని తెలిపారు. ఈనెల 22న ధూంధాం దశాబ్ది ఉత్సవాలు ఉదయం నుంచి సాయంత్రం మాట-పాట కార్యక్రమం వరకు నిర్వహిస్తామన్నారు. నగరంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో గాయకుడు రసమయి బాలకిషన్, టీన్‌జీవోల అధ్యక్షుడు దేవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.