తెలంగాణ ఏర్పాటు కాకపోతే పోరు తప్పదు

ఆదిలాబాద్‌, జనవరి 20 : కేంద్రం నిర్ణయం మేరకు ఈ నెల 28వ తేదీలోగా తెలంగాణ ప్రకటన రాకపోతే పోరు తప్పదని ఐకాస నేతలు హెచ్చరించారు. తెలంగాణ కోరుతూ ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 1113 రోజకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డిసెంబర్‌ 9న కేంద్రం చేసిన ప్రకటనను అడ్డుకున్న సీమాంధ్ర నేతలు మళ్ళీ తెలంగాణను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని వారు ఆరోపించారు. అఖిల పక్ష సమావేశంలో తెలంగాణ ఏర్పాటు విషయమై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని ప్రకటించడంతో కేంద్రం తెలంగాణ ఏర్పాటు విషయంలో నిర్ణయం తీసుకునే తరుణంలో సీమాంధ్ర నేతలు విభన్న ప్రకటనలు చేయడాన్ని వారు ఖండించారు. తెలంగాణను అడ్డుకున్న, కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకోకపోతే యుద్ధం తప్పదని వారు హెచ్చరించారు. వెంటనే కేంద్రం ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణను ప్రకటించి వారి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు.