తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు..

హైదరాబాద్‌, జనవరి 7: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఐదో తరగతి ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 11న నిర్వహించనున్నట్లు గురుకుల సెట్‌ కన్వీనర్‌ నవీన్‌ నికోలస్‌ తెలిపారు. పరీక్ష రోజున ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సంబంధిత పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును జనవరి 20 వరకు పొడిగిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ సొసైటీల కింద మొత్తం 643 గురుకులాలు ఉండగా.. వీటిల్లో 51,924 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బాలికలకు 353, బాలురకు 290 గురుకులాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్‌తో పాటు బోనఫైడ్‌ లేదా స్టడీ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్‌ చేయవల్సి ఉంటుంది.

సొసైటీల వారీగా బాలికలు, బాలుర గురుకులాలు, అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య

  • బాలికలకు 141, బాలురుకు 91 సాంఘిక సంక్షేమ గురుకులాలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 18,560 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • బాలికలకు 46, బాలురుకు 36 గిరిజన సంక్షేమ గురుకులాలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 6,560 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • బాలికలకు 146, బాలురుకు 148 బీసీ సంక్షేమ గురుకులాలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 23,680 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • బాలికలకు 20, బాలురుకు 15 సాధారణ సొసైటీ గురుకులాలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 3,124 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ప్రాథమిక కీ విడుదల

జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌) డిసెంబర్‌-2023 ప్రాథమిక కీని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) తాజాగా విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో ఆన్సర్‌ ‘కీ’ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్సర్‌ ‘కీ’పై అభ్యంతాలుంటే జనవరి 8వ తేదీలోగా ఆన్‌లైన్‌లో తెలియజేయవచ్చని ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా 356 కేంద్రాల్లో డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో జరిగిన పరీక్షలకు మొత్తం 2,19,146 మంది అభ్యర్థులు హాజరయ్యారు.