తెలంగాణ జాతీయ వజ్రోత్సవాలను ఏర్పాట్లు సిద్ధం
మహబూబాబాద్, సెప్టెంబర్ 14
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్ తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాలో వజ్రోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు నియోజకవర్గ కేంద్రాలలో ఈ నెల 16న ర్యాలీ నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగిందని నియోజకవర్గ స్థాయిలో ఆర్డీవో డిఎస్పి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లను బాధ్యులుగా నియమించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ర్యాలీ అనంతరం భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, అదేవిధంగా 17వ తేదీన హైదరాబాదులో జరిగే కార్యక్రమానికి జిల్లా నుండి గిరిజన ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, స్వయం సహాయక బృందాలు, పాల్గొనేందుకు గాను అవసరమైన బస్సులను ఏర్పాటు చేసి, లైసెన్ అధికారులను ప్రతి బస్సుకి కేటాయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. వారికి అవసరమైన భోజనం ఏర్పాట్లు కూడా చేసినట్లు కలెక్టర్ వివరించారు. 18వ తేదీన జిల్లా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు కూడా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ 16 నుండి 18 వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జిల్లాలో ఘనంగా విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. 16వ తేదీన నియోజవర్గ కేంద్రాలలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలని దీనికి గాను జిల్లా,పోలీసు యంత్రాంగం సమన్వయంతో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు ,ర్యాలీ అనంతరం భోజన ఏర్పాట్లను ముందస్తు ప్రణాళిక బద్ధంగా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. 17వ తేదీన హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి జిల్లాల నుండి నిర్దేశించిన విధంగా ప్రజాప్రతినిధులను, అధికారులను ఉద్యోగులను స్వయం సహాయక బృందాలను పంపించేందుకు జిల్లా మంత్రివర్యులు శాసనసభ్యులతో సంప్రదించి తగు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లకు సూచించారు. 18వ తేదీన జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయ భవనాలు పోలీస్ స్టేషన్లు, ప్రధాన జంక్షన్ లను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. నియోజకవర్గ కేంద్రాలలో విస్తృత ప్రచారానికి గాను హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని గోడ పత్రికలను బస్సులపై , ప్రధాన జంక్షన్లో అంటించడం ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలని ఆయన అన్నారు. డి. జీ.పి. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మూడు రోజులపాటు జరిగే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఉండాలని పోలీసు అధికారులకు ఆయన సూచించారు 16వ తేదీన ర్యాలీ, 17వ తేదీన హైదరాబాద్ కు పంపబడుతున్న బస్సులకు ఇలాంటి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పకడ్బందీ ప్రణాళిక ప్రకారం తగు ఏర్పాట్లు ఉండాలని ఆయన సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్.పి.శరత్ చంద్ర పవార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, డి.ఆర్. డి.ఓ. సన్యా సయ్యా, డి.ఈ.ఓ.అబ్దుల్ హై, జెడ్.పి.సి.ఈ.ఓ. రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి నర్మద, ఆర్.డి.ఓ.లు రమేష్, కొమురయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.