తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి

-కలెక్టర్ శశాంక

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్ 13(జనంసాక్షి)

సెప్టెంబర్ 16 నుండి 18 వరకు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో వజ్రోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 16 నుండి 18 వరకు 3 రోజులపాటు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహించుటకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన మేరకు, జిల్లా మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, డోర్నకల్ శాసన సభ్యులు రెడ్యా నాయక్ సూచనల మేరకు ఈ నెల 16న రెండు నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టనున్నమని, ర్యాలీ అనంతరం పాల్గొన్న వారందరికీ భోజన ఏర్పాట్లు కలెక్టర్ సూచించారు. నియోజకవర్గానికి ఒక నోడల్ అధికారిని నియమించినట్లు ఆయన అన్నారు. ర్యాలీలో ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు అందరూ విధిగా హాజరు కావాలని, ప్రతి మండలం నుండి ఒక లక్ష్యం పెట్టుకొని జన సమీకరణ చేయాలన్నారు. 17వ తేదీన జిల్లా కేంద్రంలో జిల్లా మంత్రి వర్యులచే జాతీయ పతాకావిష్కరణ ఉంటుందని, ఇట్టి కార్యక్రమంలో శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని, దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత కొమురం భీం బంజారా భవన్, సంత్ సేవాలాల్ భవన్ లను ప్రారంభిస్తారని,
ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి వర్యులు, శాసన సభ్యులు, జిల్లాలోని వార్డు మెంబర్ నుండి ప్రతి ఎస్టీ ప్రజాప్రతినిధి, ప్రతి ఎస్టీ ఉద్యోగి, పెద్ద ఎత్తున కోయ, బంజారా తదితర ఎస్టీ ప్రజలను తరలించాలని దీనికి పకడ్బందీ కార్యాచరణ చేయాలన్నారు. ప్రతి మండలం నుండి బస్సులను ఏర్పాటు చేయాలని, రూట్ మ్యాప్ చేపట్టి, సమయానికి గమ్యస్థానం చేరేలా కార్యాచరణ చేయాలన్నారు. టిఫిన్ తో సహా, భోజన ఏర్పాట్లు చేయాలని, ఒక్కొక్క బస్సుకు ఒక అధికారిని బాధ్యునిగా నియమించాలని అన్నారు.
18న స్థానికంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు తగుఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఎస్.పి.శరత్ చంద్ర పవార్, డి.ఆర్. డి.ఓ. సన్యా సయ్యా, డి.ఈ.ఓ.అబ్దుల్ హై, జెడ్.పి.సి.ఈ.ఓ. రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి నర్మద, ఆర్.డి.ఓ. రమేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.