తెలంగాణ తరహాలో పెట్టుబడి సాయం ఇవ్వాలి
కౌలురైతు సంక్షేమ సంఘం డిమాండ్
రాజమండ్రి ,ఆగస్ట్9(జనం సాక్షి):ఎరువులు, పురుగుమందులపై జిఎస్‌టి వల్ల పెట్టుబడి భారం పెరిగిందని ఎపి కౌలురైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్య అన్నారు. ధాన్యానికి రూ.150 పెంచి ఎరువులపై రూ.200 పెంచి అదనపు భారం మోపారన్నారు. కేరళాలో మాదిరిగా రుణ విమోచన చట్టాన్ని అమలు చేయాలన్నారు. తెలంగాణాలో రైతుకు పెట్టుబడిగా రూ.8 వేలు అందిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కౌలురైతుకు ఎకరాకు రూ.10 వేలు పూర్తిసబ్సిడీపై అందించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల శ్రేయస్సుకోసం ప్రత్యేకంగా కౌలురైతుల సంక్షేమశాఖ ఏర్పాటు చేయాలని అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు పెట్టుబడికి 50శాతం అధనంగా ధాన్యానికి మద్దతు ధర అందించాలన్నారు. క్వింటాల్ ధాన్యానికి రూ.3 వేలు మద్ధతుధర ఇవ్వాలన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలైన ఉద్యానవన, రెవెన్యూ, బ్యాంకింగ్, వ్యవసాయశాఖల సమన్వయ లోపం వల్ల ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నారన్నారు. కౌలు రైతులకు సంక్షేమశాఖను ఏర్పాటు చేస్తే రైతాంగం సమస్యలను నేరుగా ఆశాఖ ద్వారా పరిష్కరించుకునే వీలుంటుందన్నారు. కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 25 నుంచి కాకినాడ నుంచి గుంటూరు కమిషనరేట్ వరకూ 20 రోజులపాటు పాదయాత్ర చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా కౌలురైతుల సమస్యలను తెలుసుకుని అవసరమైన కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. పంటలు వేయని భూ యజమానులకు బ్యాంకులు ఏప్రిల్, మే నెలల్లోనే పంటరుణాలు ఇచ్చాయన్నారు. దీని వల్ల కౌలు రైతుకు అన్యాయం జరుగుతుందన్నారు. పంట రుణంతో పాటు కౌలు మొత్తాన్ని రుణ రూపంలో కౌలు రైతుకు అందించాలని జమలయ్య డిమాండ్ చేశారు. అదేవిధంగా పంటలపై బీమా, నష్టపరిహారాలు నేరుగా కౌలు రైతుకే ఇవ్వాలన్నారు.