తెలంగాణ పోరాటాలన్నీ భూమికోసమే..

` భూరికార్డు అత్యంత ప్రాధాన్యం
` ధరణి’తో ఎన్నో సమస్యలు.. అందుకే ‘భూభారతి’ తెచ్చాం
` పోర్టల్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
` రైతులకు నష్టం చేసిన ‘ధరణి’ని పక్కన పడేశాం: మంత్రి పొంగులేటి
` ఈ పోర్టల్‌ ఓ మైలురాయి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో జరిగిన పోరాటాలన్నీ భూమి చుట్టూ తిరిగాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘జల్‌.. జంగిల్‌.. జమీన్‌’ నినాదంతో కుమురంభీమ్‌ పోరాడితే.. భూమి కోసం, విముక్తి కోసం దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ పోరాటం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘భూభారతి’ పోర్టల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా శిల్పకళావేదికలో సీఎం మాట్లాడారు. భూగరిష్ఠ పరిమితి చట్టం తెచ్చి భూస్వాముల నుంచి మిగులు భూములను కాంగ్రెస్‌ ప్రభుత్వం సేకరించిందని గుర్తు చేశారు. సేకరించిన మిగులు భూములను ఇందిరాగాంధీ ప్రభుత్వం పేదలకు పంచిందని చెప్పారు.‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతో అధ్యయనం చేసి భూ చట్టాలను చేసింది. కానీ, గత పాలకులు ఉన్నపళంగా మంచి చట్టాన్ని రద్దు చేసి ‘ధరణి’ తీసుకొచ్చారు. అనాలోచితంగా తెచ్చిన ధరణి చట్టం ఎన్నో సమస్యలకు కారణమైంది. అంబేడ్కర్‌ జయంతి రోజున భూభారతి చట్టాన్ని 69 లక్షల కుటుంబాల రైతులకు అంకితం చేస్తున్నాం. రెవెన్యూ సిబ్బందిని గత సీఎం ఎన్నో రకాలుగా అవమానించారు. రెవెన్యూ సిబ్బంది అంటే.. ప్రజలను దోచుకునే వారిగా చిత్రీకరించారు. ఎలుక దూరిందని ఇల్లు తగలబెట్టే వ్యవహారం చేశారు. గ్రామాల్లో రైతుల సమస్యలను పరిష్కరించే ఉద్యోగులను తొలగించారు.‘కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుంది. ‘ధరణి’ని బంగాళాఖాతంలో వేస్తుంద’ని ఆనాడే చెప్పాం. రైతుల సమస్యలకు భూభారతి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుకుంటున్నా. రెవెన్యూ సిబ్బందిని దోషులుగా చూపే విధానానికి నేను పూర్తి వ్యతిరేకం. వారిని ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది. రైతుల హక్కులు కాపాడేందుకు అహర్నిశలు కృషి చేసిన రెవెన్యూ ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రభుత్వం, అధికారులు వేర్వేరు కాదు. రెవెన్యూ సిబ్బంది, ప్రభుత్వం కలిసి నడిస్తేనే ఏదైనా విజయవంతమవుతుంది. ప్రతి మనిషికి ఆధార్‌ వలే.. ప్రతి భూమికి భూధార్‌ తెస్తాం. ప్రతి భూమికి కచ్చితమైన సరిహద్దులతో రిజిస్ట్రేషన్‌ చేద్దాం’’ అని సీఎం అన్నారు. కాగా ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ప్రయోగాత్మకంగా 4 మండలాల్లో ఈ పోర్టల్‌ను అమలు చేయనున్నారు. మద్దూరు (నారాయణపేట జిల్లా), లింగంపేట (కామారెడ్డి), వెంకటాపూర్‌ (ములుగు), నేలకొండపల్లి (ఖమ్మం) మండలాలను ఎంపిక చేశారు. జూన్‌ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజల నుంచి అవసరమైన సూచనలు స్వీకరించి, తగు మార్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే స్పందన మేరకు ఎప్పటికప్పుడు పోర్టల్‌ను అప్‌డేట్‌ చేయనున్నారు.
అందుకే ‘ధరణి’ని పక్కన పడేశాం: పొంగులేటి
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ రైతులకు ప్రయోజనకరంగా ఉండలేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. దొరలకు, భూస్వాములకు అనుకూలంగా ధరణి పోర్టల్‌ను రూపొందించారని విమర్శించారు. ‘భూ భారతి’ పోర్టల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతులకు కంటి మీద నిద్రలేకుండా చేసే చట్టం చేసిందని ఆరోపించారు. ‘‘ధరణి ఆరాచకాల ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రజలకు ఉపయోగపడే పోర్టల్‌ తెచ్చాం. ప్రజలు ఆమోదించని చట్టం కాబట్టే.. ధరణిని పక్కన పడేశాం. కలెక్టర్‌ దగ్గర ఉన్న అధికారాలను వికేంద్రీకరణ చేశాం. వివిధ రాష్ట్రాల్లోని భూచట్టాలన్నింటినీ అధ్యయనం చేసి.. ఉత్తమ చట్టం రూపొందించాం. హరీశ్‌రావు వంటి నేతల సూచనలు కూడా స్వీకరించాం. ముసాయిదాను మేధావులు, రైతుల ముందు పెట్టాం’’ అని పొంగులేటి తెలిపారు.
‘భూభారతి’ ఓ మైలురాయి: భట్టి విక్రమార్క
ఏప్రిల్‌ 14 చరిత్రాత్మకమైన రోజని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అంబేడ్కర్‌ జయంతి రోజునే భూభారతి చట్టం అమల్లోకి వస్తోందని చెప్పారు. ‘‘దేశ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నోచట్టాలు వచ్చాయి. తెలంగాణ చరిత్రలో భూభారతి చట్టం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ధరణి పోర్టల్‌ రైతుల పాలిట శాపంగా మారింది. రైతుల హక్కులను కాలరాసేలా ధరణి పోర్టల్‌ ఉందని ఎన్నిసార్లు చెప్పినా.. భారాస ప్రభుత్వం వినలేదు’’ అని భట్టి విక్రమార్క అన్నారు.

 

ఎన్నో ఏల్ల పోరాటం వల్ల ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత
` అమలు చేస్తూ మంత్రులతో కలసి సీఎం రేవంత్‌ రెడ్డి ఉత్తర్వులు
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ రూపకర్త డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమానికి ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుందని ప్రభుత్వం పేర్కొంది.. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, మొత్తం 56 ఎస్సీ కులాలను మూడు విభాగాలుగా వర్గీకరించింది. మూడు గ్రూపులుగా విభజన, రిజర్వేషన్ల కేటాయింపు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రూప్‌-ఆ లో అత్యంత వెనుకబడిన కులాలకు 1 శాతం రిజర్వేషన్‌, గ్రూప్‌-ఇ లో మధ్యస్థ లబ్దిదారులకు 9 శాతం రిజర్వేషన్‌, గ్రూప్‌- ఈలో మెరుగైన స్థితిలో ఉన్న కులాలకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. ఈ విధంగా మొత్తం 15 శాతం రిజర్వేషన్లను వర్గీకరించిన రూపంలోనే కొనసాగించనున్నారు. ఈ వర్గీకరణ సామాజిక న్యాయానికి, సమతా స్థాపనకు దోహదపడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన పోరాటానికి నేడు చట్టబద్దత లభించింది. ఇది బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగడంలో ముఖ్యమైన అడుగని అన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో పేదలకు మెరుగైన అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం చురుకుగా పనిచేస్తుందని తెలిపారు. అలాగే, ప్రభుత్వం చేపట్టిన పలు ప్రజాహిత పథకాలపై ఆయన వివరించారు. యంగ్‌ ఇండియా స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్‌యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. రైతులు, రైతు కూలీలకు ఎకరాకు రూ.12 వేలు ఆర్థిక భరోసాగా అందిస్తున్నామని తెలిపారు. పేదల ఆత్మగౌరవ ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభించామని, భూమిపై హక్కుల కోసం భూభారతి పథకానికి శ్రీకారం చుట్టామని వివరించారు. ఈ నిర్ణయాలు తెలంగాణలోని ఎస్సీ వర్గాలకు సామాజిక, ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రగతిపథంలో ముందడుగు వేయడం అని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటి సరఫరాల్లో నిర్లక్ష్యం సహించబోం
` ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లకు 3500 మందిని ఎంపిక చేయండి
– కలెక్టర్లకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం
హైదరాబాద్‌(జనంసాక్షి):భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, తాగు నీటి సరఫరా అంశాల్లో నిర్లక్ష్యం సహించబోమని సీఎం రేవంత్‌ కలెక్టర్లను వివరించారు. ఎక్కడా లోపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం ముగిసింది. భూ భారతి చట్టంపై కలెక్టర్లకు పూర్తి అవగాహన ఉండాలని, జిల్లాలోని ప్రతీ మండలంలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులకు కలెక్టర్లు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. చట్టంపై ప్రజలకు సరళంగా వివరించాలని, ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని అన్నారు. జిల్లా ఇంచార్జి మంత్రి ఆమోదం తరువాతే తుది లబ్ధిదారుల జాబితా ప్రకటించాలని ఆదేశించారు.తాగునీటి సరఫరా విషయంలో జిల్లాల్లో వేసవి యాక్షన్‌ ప్లాన్‌?ను అమలు చేయాలని, నీటి లభ్యత ఆధారంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించండని అన్నారు. ఎక్కడా తాగునీటి సమస్య రాకూడదని, ఎప్పటికప్పుడు నీటిపారుదల శాఖతో సమన్వయం చేసుకుంటూ తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వివరించారు.

‘గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌’ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలి
` సీఎం రేవంత్‌ ఆదేశం
హైదరాబాద్‌(జనంసాక్షి): ‘గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌’ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలని కార్మిక శాఖను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. గిగ్‌ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించేలా బిల్లు రూపొందించాలన్నారు. గిగ్‌ వర్కర్ల భద్రతపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వారికి బీమా, ఇతర హక్కులు కల్పించేలా బిల్లు ఉండాలన్నారు. బిల్లు ముసాయిదాను ఆన్‌లైన్‌లో పెట్టాలని.. ప్రజల అభిప్రాయాన్ని సేకరించాలని సీఎం ఆదేశించారు.సూచనలను తీసుకొని, వాటిని పరిశీలించి తుది ముసాయిదాను రూపొందించాలని అధికారులను రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. గిగ్‌వర్కర్ల చట్టంలో కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. కంపెనీలు, అగ్రిగేటర్లను సమన్వయం చేసేలా కొత్త చట్టం ఉండాలని చెప్పారు. ఈ నెల 25 నాటికి బిల్లు తుది ముసాయిదాను సిద్ధం చేయాలన్నారు. మే డే రోజున చట్టం అమల్లోకి తెచ్చేలా ఏర్పాట్లు చేయాలని కార్మిక శాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.

 

అంబేడ్కర్‌కు ఘనంగా నివాళి
` పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించిన రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. ట్యాంక్‌ బండ్‌ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నివాళులు అర్పించారు. అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పించిన వారిలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, దామోదర రాజనర్సింహ,ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌, మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దళిత సంఘాలు, పలువురు నేతలు అంబేడ్కర్‌కు నివాళి అర్పించారు.

ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలిరాష్ట్రం తెలంగాణ

` దీనిపై అన్ని పార్టీలు ప్రగల్భాలు పలికాయి .. కానీ ఏదీ ముందుకెళ్లలేదు
` మా ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టి సాధించాం
` మంత్రులు ఉత్తమ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ
హైదరాబాద్‌(జనంసాక్షి):సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు మాట్లాడారు.తొలుత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవో విడుదల చేసి మొదటి కాపీని సీఎం రేవంత్‌రెడ్డికి అందించామన్నారు. ‘’ఎస్సీ వర్గీకరణపై గతంలో అసెంబ్లీలో అన్ని పార్టీల వారు మాట్లాడారు. కానీ ఏ పార్టీ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లలేదు. మా ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ప్రక్రియను వేగవంతం చేశాం. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాం. కొన్ని వేల విజ్ఞప్తులు వచ్చాయి.. వాటిని ఎంతో అధ్యయనం చేశాం’’ అని తెలిపారు.ఇవాళ్టి నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిందని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. దళితుల్లో సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలు ఉండకూడదన్నారు. ‘’ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. కొన్నివేల విజ్ఞప్తులు అందుకుని అధ్యయనం చేశాం. విద్య, ఉద్యోగాల్లో ఇకపై ఇచ్చే నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ అమలవుతుంది. ఇవాళ్టి నుంచి భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాం’’అని రాజనర్సింహ తెలిపారు.

 

15న తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం
హైదరాబాద్‌(జనంసాక్షి): ఈ నెల 15న కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. శంషాబాద్‌లోని నోవాటెల్‌లో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సీఎల్పీ సమావేశం జరగనుంది. ఇందులో నాలుగు అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. భూ భారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ-ఎస్టీ వర్గీకరణపై చర్చ ఉండనుంది. ఈమేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వ విప్‌లు సమాచారమిచ్చారు.

తాజావార్తలు