తెలంగాణ పోరుకు విద్యావంతులే వేదిక
కోదండరామ్
హైదరాబాద్, జనవరి 12 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి విద్యావంతులే వేదికగా నిలిచారని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. శనివారం సికింద్రాబాద్‌లోని తెలంగాణ ఫిలిం చాంబర్‌లో నిర్వహించిన తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామిక విలువలతో, అత్యంత క్రమశిక్షణతో ఉద్యమ స్ఫూర్తిని విద్యావంతుల వేదిక కొనసాగిస్తోందన్నారు. విద్యావంతులు ఉద్యమ వ్యాప్తికి ఎంతో కృషి చేశారని, ఇంకా చేస్తూనే ఉన్నారని కొనియాడారు. ఎనిమిదేళ్లుగా వేదిక తెలంగాణ భావవ్యాప్తికి ఎంతగానో పాటుపడుతోందన్నారు. కీలక సమయాల్లో వేదిక ఉద్యమానికి దిశా నిర్దేశం చేసిందని, రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేయడంలో ఎంతగాటో పాటుపడిందని అన్నారు. తెలంగాణ అస్థిత్వ పోరాటానికి వేదిక రూపకల్పన చేసిందని తెలిపారు. తెలంగాణ సాధన ఉద్యమంలో ఇప్పుడు కీలక సమయమని, ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటే సీమాంధ్ర పెట్టుబడిదారీ శక్తులు అడ్డుకునేందుకు ఎన్ని కుఠిల యత్నాలైనా చేస్తుందన్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆయా వర్గాలు మూకుమ్మడిగా ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారని, దీనిని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ మంత్రులు, ముఖ్య నేతలు గుర్తించాలని సూచించారు. ఇప్పుడు ఏమాత్రం వెనక్కి తగ్గినా మళ్లీ తెలంగాణ వెనక్కి వెళ్లడం ఖాయమని, దీనిని కాంగ్రెస్ పార్టీ నేతలు గమనించాలని కోరారు. తెలంగాణ ఏర్పాటుపై ఈనెల 28లోగా కేంద్రం నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిందని, ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గకుండా ఉండేందుకు వారిపై ఒత్తిడి పెంచాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్యావంతుల వేదిక నాలుగో రాష్ట్ర మహాసభలను ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. వేదిక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య ఈ విషయం వెల్లడించారు. 10న సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని, 11న ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రతినిధుల సభ, మహాసభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రవేశపెట్టనున్న రాజకీయ విధాన పత్రం రూపొందించే బాధ్యతను పిట్టల రవీందర్, శ్రీధర్‌రావు దేశ్‌పాండే, గురిజాల రవీందర్‌రెడ్డి, కవ్వా లక్ష్మారెడ్డిలతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సి. విఠల్, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్య్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.