తెలంగాణ సర్కార్‌కు ఇడి షాక్
క్లీన్ చిట్ ఇచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నోటీసులు
నోటీసులను స్వాగతించిన ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్
న్యూఢల్లీి/హైదరాబాద్,ఆగస్ట్26(జనంసాక్షి): తెలంగాణ సర్కార్‌కు ఇడి షాక్ ఇచ్చింది. క్లీన్ చిట్ ఇచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నోటీసులు జారీ అయ్యాయి. 2017 నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన చేతుల్లోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆరోపణలను ఎదుర్కొంటున్న 16 మందిలో 12 మందికి సమన్లు జారీ చేసింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటీమణులు చార్మీ, రకుల్, ముమైత్ ఖాన్, నటులు రానా, నందు, రవితేజ, నవదీప్, తనీష్, తరుణ్, శ్రీనివాస్, ఎఫ్ క్లబ్ జిఎంలకు విచారణకు హాజరు కావాలంటూ సమన్లను పంపింది. ఆగస్టు 31న పూరి జగన్నాథ్, సెప్టెంబర్ 2న ఛార్మీ, 8న రానా, 9న రవితేజ, శ్రీనివాస్ హాజరు కావాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 13 నవదీప్, ఎఫ్ క్లబ్ జిఎం, 15న ముమైత్ ఖాన్, 17న తనీష్, 20న నందు, 22న తరుణ్ విచారణకు హాజరు కావాలని ఇడి నోటీసుల్లో పేర్కొంది. సిట్ నివేదిక, ఎక్సైజ్ శాఖ జరిపిన విచారణ వివరాలను ఇడి అధికారులు పరిశీలించిన తర్వాతే ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో తొలుత రకుల్, రానా పేర్లు లేవు… అయితే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత వెలుగు చూసిన భారీ డ్రగ్స్ కుంభకోణంలో వీరి పేర్లు బయటకు వచ్చాయి. దీంతో వీరిని విచారణకు పిలిచినట్లు సమాచారం. అయితే ఈ కేసులో క్లీన్ చిట్ వచ్చిన సంగతి విదితమే. ఇందులో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగినట్లు ఆధారాలు లభించడంతో ఇడి విచారిస్తోంది. రవితేజ సోదరుడు భరత్ శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఈ డ్రగ్స్ కుంభకోణం బయటకు వచ్చింది. ఆ సమయంలో కారులో ఆయన ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్‌ను పరిశీలించగా..పెద్ద డ్రగ్స్ మాఫియా ఉందని పోలీసులు గుర్తించారు. భరత్ ఫోన్‌లో లభించిన సమాచారం ఆధారంగా కొంత మంది డ్రగ్ పెడ్లర్లను పట్టుకుని కూపీ లాగారు. దీంతో 2017 కొంత మంది అనుమానితులుగా పేర్కొంటూ పోలీసులు ఈ డ్రగ్ కేసు నమోదు చేశారు. ఇందులో టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువుర్ని ప్రశ్నించారు. అప్పుడు అదో పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది. తర్వాత తెలంగాణా పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వడంతో… ఇడి రంగంలోకి దిగింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ శుభపరిణామమని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. నాలుగేళ్లుగా దర్యాప్తు పేరుతో ఎక్సైజ్ పోలీసులు కేసును నీరుగార్చారని విమర్శించారు. సినీ స్టార్స్‌కు డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయని వార్తలొచ్చాయని, ఒక్కరి పేరు కూడా ఛార్జ్‌షీట్‌లో పెట్టకపోవడం అనుమానాలకు దారితీస్తోందన్నారు. డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ నోటిసులిచ్చిందన్నారు. టాలీవుడ్‌లో డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, మనీ లాండరింగ్ వ్యవహారంపై.. ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తుందని ఆశిస్తున్నామని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు.