తెలివైన అమ్మ ఏం చేసిందంటే..!

న్యూయార్క్: చిన్నపిల్లలను పెంచడం పెద్ద సవాలే. నిలకడలేని ఆలోచనలు.. వేగంగా పరుగెత్తే వారి మనసును అందుకోవడం మహా కష్టమే. మారం చేశారంటే చాలా తక్కువ మంది మాత్రమే వారిని కంట్రోల్ చేయగలుగుతారు. ఇలా కంట్రోల్ చేయగలిగే వారిలో ఎప్పుడూ అమ్మదే అగ్రస్థానం. దేశాలు వేరైనా నాన్న మాటలు నమ్మరేమోగానీ.. అమ్మ చెప్పిన మాటలు మాత్రం చిన్నపిల్లలకు ఎప్పటికీ వేదాలే.
అమెరికాలో స్కూల్ కు వెళ్లనని మారం చేస్తున్న తన మూడేళ్ల బాలుడిని తన తల్లి కొట్టకుండా తిట్టకుండా కేవలం తన తెలివి తేటలతో తిరిగి పాఠశాలకు వెళ్లేలా చేసింది.

అది కూడా గతంలో కంటే ఎక్కువ విశ్వాసంతో తరగతులకు హాజరయ్యేలా. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రిటానీ బినేష్ అనే మహిళకు ఆడేన్ అనే మూడేళ్ల బాలుడు ఉన్నాడు. అతడు ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేసుకుంటూ స్కూల్ కు వెళుతున్నాడు. అయితే, ఇటీవల ఆ బాలుడు కిందపడ్డాడు. దీంతో అతడి నుదుటిపై గీతగీసినట్లుగా ఓ గాయం ఏర్పడింది. అలా గాయపడిన మరుసటి రోజే తాను స్కూల్ కు వెళ్లనని.. తన ఫ్రెండ్స్ ఏడిపిస్తారని మారం చేయడం మొదలుపెట్టాడు.

అన్ని రకాలుగా బ్రతిమిలాడిన ఆ తల్లి చివరకు ఓ చక్కటి ఉపాయాన్ని ఆలోచించింది. గాయం అయ్యి గీతాలగా కనిపిస్తున్న దానిని ఓ రెడ్ మార్కర్ తో ఎస్ గా మార్చింది. అనంతరం ఆ బాలుడికి హ్యారీ పోటర్ సినిమాలో హ్యారీ ధరించిన కళ్లద్దాల్లాంటివి పెట్టి అతడికి చూపించింది. హ్యారీ పోటర్ సినిమాలో హ్యారీకి కూడా నుదుటిపై అచ్చం ఇలాంటి గుర్తే ఉండటంతో ఆ బాలుడు తాను కూడా ఓ హ్యారీ పోటర్నే అన్న సంతోషంలో గెంతుతూ స్కూల్ కు వెళ్లడం మొదలుపెట్టాడు. ఈ సందర్భంగా ఆ తల్లి తన కుమారుడి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టగా అవి హల్ చల్ చేస్తున్నాయి.