తెలుగులోగిళ్లలో భోగి సంబరాలు

ఉత్సాహంగా భోగిమంటలు వేసిన ప్రజలు

విజయవాడ,జనవరి14(జ‌నంసాక్షి): సంక్రాంతి పండగ సందర్భంగా తెలుగు లోగిళ్లు సందడిగా మారాయి. భోగి పండగతో ఉదయమే భోగిమంటలతో కనువిందు చేశారు. ప్లలెల్లో తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడుతున్నాయి. ఇళ్ల ముందు రంగవల్లులు కనువిందు చేస్తున్నాయి. భోగి మంటలు వేసి ఆనందోత్సాహలతో వేడుకలు జరుపుకొంటున్నారు. రంగురంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలతో వాకిల్లు అందంగా దర్వనమిచ్చాయి. విజయవాడలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. భోగిని పురస్కరించుకుని పలుచోట్ల తెల్లవారుజామున భోగి మంటలు వేశారు. అంతా కలిసి భోగి మంటల వెలుగుల్లో సంక్రాంతికి స్వాగతం పలికారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బృందావన్‌ గార్డెన్సులోని ఎన్టీఆర్‌ స్టేడియంలో భోగి మంటలు వేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ విశిష్టతను చాటుతూ సంప్రదాయాలను గుర్తు చేసేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో సంక్రాంతి శోభ సంతరించుకుంది. నగరంలో వాడవాడలా చిన్నా పెద్దా అందరూ కలిసి భోగి మంటలు వేశారు. మంత్రి సిద్ధ రాఘవరావు తన నివాసం వద్ద కుటుంబంతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి ఆనందోత్సాహాలతో నగరవాసులు వేడుకలు జరుపుకొంటున్నారు.