తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి నెలలో జీఎస్టీ పెరుగుదల

 

 

 

 

 

న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రూ.3,157 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఇది గత ఏడాది ఫిబ్రవరి కంటే 19 శాతం ఎక్కువ. అటు, తెలంగాణలో కూడా జీఎస్టీ ఆదాయం 13 శాతం పెరిగి రూ.4,113 కోట్లకు చేరుకున్నది. ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు ఉన్నప్పటికీ జీఎస్టీ వసూళ్లలో పెరుగుదల కనిపించింది.

మరోవైపు, దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం ఐదోసారి రూ.1.30 లక్షల కోట్ల మార్కును దాటింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1,33,026 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువ. ఫిబ్రవరి జీఎస్టీ స్థూల ఆదాయంలో సెంట్రల్ జీఎస్టీ రూ.24,435 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.30,779 కోట్లుగా ఉన్నాయి.

ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ కింద రూ. 67,471 కోట్లు వసూలు కాగా, వస్తువుల దిగుమతులపై రూ.33,837 కోట్లు కలుపుకుని సెస్ రూ.10,340 కోట్లు అందాయి. గత నెలలో దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం గతేడాది కంటే 38 శాతం ఎక్కువగా ఉన్నది.