తెల్లబల్లి సొసైటీలో అంతా అవినీతిమయం?
ధాన్యం కొనుగోలులో అక్రమాలు?
చైర్మన్,సీఈవో బంధువులకే అందుతున్న రుణాలు సబ్సిడీలు?….
సొసైటీలో చైర్మన్ కుమారుని జోక్యం ?…
అంతా తానై చక్రం తిప్పుతున్న వైనం?…
వరుస మూడు సమావేశాలకు లేని కోరం…
అయినా కొనసాగుతున్న సొసైటీ కార్యకలాపాలు….
జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన డైరెక్టర్లు….
అనంతగిరి జనంసాక్షి:
రైతన్న రాజును చేయడమే లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం దృష్ట్యా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ ముందుకు కొనసాగుతుంది.రైతులకు తక్కువ వడ్డీతో మరియు సబ్సిడీకి రుణాలు అందజేస్తూ రైతుల పంట పొలాలకు తక్కువ ధరకే యూరియాను విక్రయిస్తూ,ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దీర్ఘకాలిక రుణాలను అందిస్తుంది.గత ప్రభుత్వాల నుండి అమలవుతున్నటువంటి సహకార సంఘాల ద్వారా రైతులకు మేలు కలుగుతుందనే ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే సంకల్పంతో ముందుకు కొనసాగుతుంది.ఈ క్రమంలోనే రైతు రుణాల కోసం లక్షల రూపాయలను వెచ్చిస్తుంది.ప్రభుత్వం ఉన్నతమైన లక్ష్యంతో ముందుకు కొనసాగుతున్న తరుణంలో కొన్ని సొసైటీలలో అధికారులు చైర్మన్లు చేస్తున్నటువంటి అవినీతి వల్ల అప్రతిష్ట మూట కట్టుకోవాల్సి వస్తుంది.వివరాల్లోకెళితే సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల పరిధిలోని తెల్లబల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ అంత అవినీతిమయంగా మారిందని వైస్ చైర్మన్ మరియు ఐదుగురు డైరెక్టర్లే బాహాటంగా పేర్కొంటున్నారు.తెల్లబల్లి,వా యిలసింగవరం గ్రామాలను కలిపి సొసైటీగా ఏర్పాటు చేశారు.ఈ సొసైటీ పరిధిలో 1200 మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.ఇదిలా ఉండగా గత కొంతకాలంగా సొసైటీ పరిధిలో 12 మంది డైరెక్టర్లు ఉండగా వైస్ చైర్మన్ తోపాటు ఐదుగురు డైరెక్టర్లు సహకార సంఘం అవినీతిపై నేరుగా డిసిఒ,కలెక్టర్కు వినతి పత్రాలు అందజేసి విచారణ జరపవలసిందిగా కోరారు.వారు చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణలు వరుసగా మూడు సమావేశాలు కోరం లేకుండా జరిపారు.సొసైటీ నిబంధనల ప్రకారం మూడు నెలలకు సమావేశం జరగాల్సి ఉంది.మే,జూన్, జూలై నెలలలో జరిగిన వరుస మూడు సమావేశాలు కోరం లేకుండానే ముగిశాయి.సొసైటీ నిబంధనల ప్రకారం వరుసగా మూడు సమావేశాలకు కోరము లేకుండా ఉంటే పాలకవర్గాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారనే విషయం తెలియజేయకుండా జిల్లా అధికారులు కూడా తాత్చర్యం చేస్తున్నారు.ఇదే విషయమై గత కొంతకాలంగా సొసైటీలో చైర్మన్,డైరెక్టర్ల మధ్య విభేదాలకు దారితీసింది…
సొసైటీలో చైర్మన్ కుమారుని జోక్యం?
సొసైటీ పరిధిలోని కార్యకలాపాలలో చైర్మన్ కుమారుడు జోక్యం డైరెక్టర్ లకు మింగుడు పడడం లేదు.ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ కూడా కార్యకలాపాలలో తల దురుస్తూ వివాదాలకు దారితీస్తున్నారని డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు.సొసైటీలో జరిగే ప్రతి విషయం ఆయనకు తెలియజేయాలంటూ సొసైటీ సిబ్బందికి హుకుం జారీ చేశారని వారు పేర్కొన్నారు.ఇదిలా ఉండగా గత నాలుగు సీజన్లకు సంబంధించి రవాణా చార్జీలకు సంబంధించినటువంటి నగదు చైర్మన్,సీఈఓ ఖాతాలో కాకుండా చైర్మన్ కోడలు ఖాతాలో జమ అయయని,కొంత నగదు నేరుగా తీసుకున్నారని, కొంతమేర నగదు మాత్రమే రైతులకు పంపిణీ చేశారని వారు ఆరోపించారు.అంతేకాకుండా చైర్మన్ భార్య పేరు మీద క్రాప్ లోను ఉండగా అదే పట్టాదారు పాసుబుక్ పై ఉన్న వ్యవసాయ భూమిని చైర్మన్ చిన్న కుమారుడు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ పట్టాదరు పాస్ బుక్కు ద్వారా దీర్ఘకాలిక రుణాన్ని పొందడం జరిగిందని వారు ఆరోపించారు.ఇదే విషయమై చైర్మన్ చిన్న కుమారుఢు నరేష్ ను వివరణ కోరగా తెల్లబల్లి సొసైటీకి నాకు ఎటువంటి సంబంధం లేదని కావాలనే కొంతమంది డైరెక్టర్లు నాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని వారు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగి నాయన నేను గ్రామానికి దూరంగా నా విధులు నేను నిర్వర్తించుకుంటున్నానని గ్రామంతో,గ్రామ సొసైటీ తోటి ఎటువంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు.నాపై డైరెక్టర్లు చేసినటువంటి ఆరోపణలు అవాస్తవం.ఉన్నతాధికారులు ఒకవేళ విచారణ జరిపినట్లైతే వాస్తవాలు నిరూపణ అయితే ప్రభుత్వపరంగా ఏ చర్యకైనా నేను సిద్ధంగా ఉన్నానని దిశతో పేర్కొన్నారు.
బంధువులకి అధిక మొత్తంలో రుణాలు….
సొసైటీ పరిధిలోని రుణాలను అధిక మొత్తంలో చైర్మన్,సీఈఓ బంధువులకే ఇచ్చి వారికే ఎక్కువ మొత్తంలో సబ్సిడీ అందజేయడం జరిగిందని డైరెక్టర్లు ఆరోపించారు.2020-21 సంవత్సరానికి సంబంధించి 91,80,000 లక్షల దీర్ఘకాలిక రుణాలు మంజూరయ్యాయి.వీటిలో 30,64,000 లక్షలు సబ్సిడీ ప్రభుత్వం మంజూరు చేసింది.2021-22 సంవత్సరానికి దీర్ఘకాలిక రుణాలు కోట్లు 2,22,50,000 మంజూరు చేసింది.
ధాన్యం కొనుగోలులో అక్రమాలు….
తెల్లబల్లి ఫాక్స్ పరిధిలోని తెల్లబల్లి,వాయిలసింగవరం గ్రామాల్లో కలిపి రైతులు 1200 మంది సభ్యులు.దీని పరిధిలో 500 హెక్టార్ల ఆయకట్టు కలదు.ఇట్టి విస్తీర్ణంలో 90 శాతం మంది రైతులు సన్నరకాలే సాగు చేస్తారు.ఫ్యాక్స్ పరిధిలో సీజన్కు ధాన్యం దిగుబడి 30వేల బస్తాలకు మించదని వ్యవసాయ అధికారులు అంచనా. కానీ గత నాలుగు సీజన్లలో సామర్థ్యానికి మించి ధాన్యం సేకరించి చెల్లింపులు జరిపారని డైరెక్టర్లు ఆరోపించారు. దానిలో ఎక్కువ శాతం బినామీ పేర్లు ఉన్నట్లు వారు పేర్కొన్నారు తెల్లబల్లి మామిడి తోటలు సాగుచేసే రైతుల పేరిట ధాన్యం విక్రయిస్తున్నట్లు నమోదు చేశారని ఆరోపించారు. బినామీ రైతులు,వ్యాపారి,సీఈవో వీరంతా బంధువులు కావడంతో అక్రమాలు సులువుగా జరిగినట్లు డైరెక్టర్లు ఆరోపించారు. తండ్రి కొడుకులలో ఒక్కరే సిబ్బందిగా పని చేయాలి. సంఘం సిబ్బంది చైర్మన్ కుమ్మక్కై పాలకవర్గ సభ్యులకు కూడా పాలకవర్గ సభ్యులకు కూడా ఏమీ తెలియకుండా ట్రాన్సాక్షన్స్ జరిపారని డైరెక్టర్లు ఆరోపించారు. సీఈవో మరియు తన కుమారుడు పూర్తిగా చైర్మన్, వారి కుమారుడు ఆదేశాలు మేరకు పాలకవర్గ సభ్యులకు తెలియకుండా లావాదేవీలు నడుపుతున్నారని వారు ఆరోపించారు.దీంతో వారి అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతుందని వారు ఆరోపించారు.ఈ మేరకు ఉన్నతాధికారుల చొరవ తీసుకొని సీఈవో వారి కుమారుడు వీరిలో ఎవరో ఒకరు మాత్రమే సంఘంలో పనిచేసేటట్లు చర్యలు తీసుకోవాలని వారు జీల్లా ఉన్నతాధికారులను కోరినట్లు తెలిపారు.
జిల్లా అధికారులకు ఇచ్చిన వినత పత్రాలపై విచారణ రిపోర్టు ఏది.
మా సంఘం పరిధిలో తెల్లబల్లి,వాయిలసింగవరం రెండు గ్రామాలలో పండే పంటల కంటే రెట్టింపు స్థాయిలో అక్రమాల ద్వారా కొనుగోలు చేసి,రవాణా చార్జీలు ప్రభుత్వం నుంచి పొందే క్రమంలో చైర్మన్,సీఈవో,సంఘం ఖాతాలో కాకుండా ఇతర వ్యక్తుల ఖాతాలో జమ అయ్యాయని,కొంత నగదు రూపంలో తీసుకున్నారని, మొత్తం నగదును పూర్తిస్థాయిలో రైతులకు పంచకుండా అక్రమంగా కొంత నగదును సొంతాలకు వాడుకున్నారని డైరెక్టర్లు జిల్లా అధికారికి 4వ తేదీ ఏప్రిల్ 2022 వినత పత్రాన్ని అందించారు.అంతేకాకుండా గడచిన మూడు నెలల్లో మూడు సమావేశాలు కోరం లేకుండా జరిగాయని దీనిపై విచారణ చేయాలని గత నెల ఆగస్టులో జిల్లా అధికారులకు వినతిపత్రం అందించినట్లు డైరెక్టర్లు పేర్కొన్నారు.వీటిపై విచారణ జరిపి ఫైనల్ రిపోర్టును మా డైరెక్టర్లకు అందజేయాలని వారు పేర్కొన్నారు.
పూర్తిస్థాయిలో విచారణ చేస్తాం: డిసిఓ శ్రీధర్
తెల్లబల్లి సొసైటీ పరిధిలో వస్తున్న ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం.గతంలో డైరెక్టర్లు కొన్ని సమస్యలపై వినతి పత్రం అందజేశారు.వాటిపై విచారణ కొనసాగిస్తున్నాం.విచారణలో అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.