తొలగని కొవ్వాడ అణుకుంపటి ముప్పు

ఈ ప్రతిపాదనను పూర్తిగా విరమించాలి: సిఐటియూ

విశాఖపట్టణం,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): కొవ్వాడలో అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటు జరగదన్న భరోసా లేకుండ ఆపోయిందని రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు ముప్పువాటిల్లుతుందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ నర్సింగరావు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే 177 కిలోవిూటర్ల మేర జీవకోటి ప్రాణాలకు హాని కల్గుతుందని అన్నారు. కొవ్వాడలో ప్రమాదం జరిగితే కిలోవిూటర్ల దూరం వరకూ సర్వ నాశనం అవుతుందని అన్నారు. అందకే తాము ముందునుంచి దీనిని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. దీని ప్రమాదం వలన జీవ కణంపై ప్రభావం పడి, కొన్ని తరాల వరకూ ఉంటుందని హెచ్చరించారు. ఆ ప్రాంతంలో గడ్డి కూడా మొలవదన్నారు. ఇంత తీవ్రమైన పర్యవసానాలను కొన్ని తెచ్చుకోవడం ఎందుకని ప్రశ్నించారు. విద్యుత్‌ అవసరమైనప్పటికీ అణువిద్యుత్‌ కేంద్రాల ద్వారా వచ్చే ఖరీదైన విద్యుత్‌ అవసరం లేదన్నారు. గ్యాస్‌, థర్మల్‌ ప్లాంట్లుతో తక్కువ ధరలకు విద్యుత్‌ తయారవుతుందని తెలిపారు. స్థానికులకేమైనా లాభం ఉందంటే అదీ లేదన్నారు. మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వ హయాంలో కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. అప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు దీన్ని వ్యతిరేకించారని గుర్తు చేశారు. అభివృద్ది చెందిన దేశాలన్నీ అణువిద్యుత్‌ కేంద్రాలను వ్యతిరేకిస్తున్న విషయాన్ని గమనించాలని అన్నారు. జపాన్‌లో జరిగిన న్యూక్లియర్‌ పవర్‌ ప్రాజెక్టు ప్రమాదానికి ఆ దేశం రూ. లక్షా 50వేల కోట్లు ఖర్చు చేసిందని, ఇంకా దాని రేడియేషన్‌ ప్రభావం ఆ దేశంలో ఉందని తెలిపారు. అలాంటి ప్రమాదాన్ని ఉత్తరాంధ్రపై తెచ్చి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2200ఎకరాల్లో ప్లాంటు నిర్మిస్తామని భూసేకరణ చేపడుతున్న ప్రభుత్వం 1600ఎకరాల ప్రభుత్వ భూమిని పేదల నుంచి దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తుందన్నారు. చట్ట పరంగా ప్రభుత్వ భూములు సాగు చేస్తున్న పేదలకు జిరాయితీకి ఉండే హక్కులన్నీ ఉన్నాయని కోర్టు తీర్పులు, చట్టాలు చెబుతున్నాయని వివరించారు. అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటు గురించి మాట్లాడని చంద్రబాబు ఆ ప్రాంతాల ప్రమాద జోన్‌లను గుర్తించడానికి జీవోలను విడుదల చేస్తుందన్నారు. ఇది ఒక్క కొవ్వాడకు సంబంధించిన ప్రమాదం కాదన్న విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. అభివృద్ధి చేయాలంటే పరిశ్రమలను, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి గాని, ఇలా ప్రమాద కుంపట్లు కాదన్నారు. దీన్ని అడ్డుకోవడం ఒక్కటే మార్గమని, దాని కోసం ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు.

 

తాజావార్తలు