తొలిదశ ఎన్నికలకు ప్రచారం పరిసమాప్తం

– 11న ఎపి, తెలంగాణల్లో ఒకే దశలో పోలింగ్‌
– ఎపిలో అసెంబ్లీ పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు
– తెలంగాణలో 17 ఎంపి స్థానాలకు పోలింగ్‌
– నిజామాబాద్‌లో అత్యధికంగా 185మంది బరిలో
– అత్యల్పంగా మెదక్‌లో 10మంది
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 9(జనంసాక్షి):నెలరోజులుగా ఊరూవాడా ¬రెత్తిన ఎన్నికల ప్రచారం ముగిసింది. తెలంగాఉ రాష్ట్రాల్లో సాయంత్రం ఐదింటికి ప్రచారం ముగిసింది. ఇసి ఆదేశాలతో 5 కల్లా ప్రచారాన్ని కట్టిపెట్టారు. నిజామాబాద్‌లో మాత్రం 6గంటల వరకు ప్రచారానికి అవకాశం ఇచ్చారు. తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్వానికి గడువు ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 11న పోలింగ్‌ జరగనుంది. ఈ సాయంత్రం 5గంటలకే ప్రచారాన్ని ముగించాలన్న ఈసీ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో మైకులన్నీ మూగబోయాయి. అయితే నిజామాబాద్‌ నియోజకవర్గంలో మాత్రం ప్రచారానికి సాయంత్రం 6 గంటల వరకు సమయమిచ్చారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీల నేతలూ చెమటోడ్చారు. గురువారం 13 నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరగనుండగా.. నిజామాబాద్‌లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6గంటల వరకు నిర్వహించనున్నారు. మిగతా నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. తెలంగాణలో మొత్తం 2,96,97,279 మంది ఓటర్లు ఉండగా.. ఎన్నికల బరిలో 443 మంది అభ్యర్థులు నిలిచారు. నిజామాబాద్‌ నుంచి అత్యధికంగా 185 మంది బరిలో ఉండగా.. అత్యల్పంగా మెదక్‌ నుంచి 10 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. సిఎం కెసిఆర్‌, కెటిఆర్‌లు సుడిగాలి పర్యటనలు ర్యాలీలతో ప్రజలను ఆకట్టుకున్నారు. సార్‌..కారు..సర్కార్‌ అన్న నినాంతో టిఆర్‌ఎస్‌ ముందుకు సాగింది. 16 సీట్లు గెలుపే లక్ష్యంగా ఊరూవాడా ప్రచారం మోరెత్తించారు. ఇకపోతే  సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎపిలో కూడా ఎన్నికల ప్రచారం ముగిసింది. తెలుగు రాష్ట్రాలతో తో పాటు దేశంలోని 20 రాష్టాల్లో మొత్తం 91 లోక్‌సభ స్థానాలు, ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 11న పోలింగ్‌ జరగనుంది. ఈ సాయంత్రం 6 గంటలకు ప్రచారాన్ని ముగించాలన్న ఈసీ ఆదేశాల నేపథ్యంలో మైకులన్నీ మూగబోయాయి. నిజామాబాద్‌ మినహా తెలంగాణలో ఈ సాయంత్రం 5గంటలకే ప్రచార పర్వానికి తెరపడింది. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఈ నెల 11న పోలింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లునూ ఎన్నికల సంఘం పూర్తి చేసింది.  రాష్ట్రంలో మొత్తం 3,93,45000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 10లక్షల మంది యువత తొలిసారిగా తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 56వేల మంది పైచీలుకు సర్వీస్‌ ఓటర్లు, 4లక్షల మంది వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోనున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీల నేతలూ చెమటోడ్చారు. ఏపీలో తెదేపా, వైకాపా, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, జగన్‌, పవన్‌ కల్యాణ్‌తో పాటు తెలంగాణలో తెరాస అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తదితరులు ప్రచార సభలు, రోడ్‌షోలతో ¬రెత్తించారు. రెండు తెలుగు రాష్టాల్లోన్రూ కాంగ్రెస్‌, భాజపా నుంచి ఆ పార్టీ జాతీయ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తదితరులు సభలకు హాజరయ్యారు. అలాగే, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సహా పలువురు నేతలు ప్రచారం చేశారు. అన్ని పార్టీల నేతలు ప్రత్యర్థులపై కత్తులు దూశారు. చేసిన, చేయబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ అధికార పార్టీలు ముందుకెళ్లగా.. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రతిపక్షాలు ప్రచారం నిర్వహించాయి. ఏపీలో ఒకే దశలో ఎన్నికలు జరగడంతో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమించారు.  ఈ సార్వత్రిక ఎన్నికలు ఈనెల 11న ప్రారంభమై మే 19తో  ముగియనున్నాయి. ఏడు దశల్లో జరిగే ఈ ఎన్నికలను సుదీర్ఘంగా 40 రోజులపాటు ఈసీ పోలింగ్‌ జరుపుతోంది. ఎన్నికల ఫలితాలు మే 23న విడుదలకానున్నాయి.  ఏపీ, తెలంగాణ రాష్టాల్లోన్రి అన్ని లోక్‌ సభ స్థానాలకు ఎన్నికలు ఈ విడతలోనే జరుగనున్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని 2, అసోంలోని 5, బీహార్‌ లో 4, చత్తీస్‌ గఢ్‌లో 1, జమ్మూకశ్మీర్‌ లోని 2, మహారాష్ట్రలోని 7, మణిపూర్‌ లోని 1, మేఘాలయలోని 2, మిజోరంలోని 1, నాగాలండ్‌ లోని 1, ఒడిశాలోని 4, సిక్కింలోని 1, త్రిపురలోని 1, ఉత్తరప్రదేశ్‌ లోని 8, ఉత్తరాఖండ్‌ లోని 5, పశ్చిమ బెంగాల్‌ లోని 2, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌ లలోని ఒక్కోస్థానానికి తొలిదశలో ఎన్నికలు జరుగనున్నాయి. తొలి దశ ఎన్నికల్లో 1,280 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, ఇందులో 1,188 మంది పురుషులు, 92 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.  ఎన్నికల నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈసీ, ఆ దిశగా చర్యలు చేపట్టింది. ప్రతి పోలింగ్‌ కేంద్రాల వద్ద మౌలిక వసతుల ఏర్పాట్లతోపాటు, భద్రతా దళాల మోహరింపుపై ఈసీ ప్రత్యేక దృష్టిసారించింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా ప్రతీ పోలింగ్‌ కేంద్రంలోను విద్యుత్‌, తాగునీరు, టాయిలెట్స్‌, స్నాక్స్‌, పండ్లు వంటి  వసతులు కల్పించేందు అన్ని చర్యలు తీసుకుంది. వికలాంగులు ఓటు వేసేందుకు వీల్‌ చైర్లు..అలాగే వారి కోసం ప్రత్యేక ర్యాంప్‌లు, ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకునేలా అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించారు. పోలింగ్‌ కేంద్రాలకు 200 విూటర్ల లోపల అన్ని పోలింగ్‌ కేంద్రాల దగ్గర మద్యం  షాపులను మూసివేయాలని ఆదేశించింది. సమస్యాత్మక ప్రాంతాలలో ప్రత్యేక నిఘా..పోలింగ్‌ కేంద్రాలపై ఆయా జిల్లాలకు సంబంధించిన యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతి ఓటరు విధిగా ఓటు వేసేలా పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంది.

 

తాజావార్తలు