తోటపల్లి రద్దుతో ప్రజల చెవిలో పూజలు: కాంగ్రెస్
కరీంనగర్,ఏప్రిల్ 2(జనంసాక్షి): రీడిజైన్ పేరుతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రక్కన పెట్టారని, ఎడారిగా ఉన్న హుస్నాబాద్‌కు వరప్రదాయిని అయిన తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేశారని ఇంతకంటే దౌర్బాగ్యం మరోటి ఉంటుందా అని కాంగ్రెస్ నేత జడ్పీ మాజీ ఛైర్మన్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. కాళేశ్వరం, ముక్తేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం కావాలని నిలిపివేస్తోందని.. పేద ప్రజలకు అన్యాయం చేస్తే వూరుకోబోమన్నారు. ఇప్పటికే తోటపల్లి ప్రాజెక్టును రద్దుచేసి తమ ప్రాంతానికి మేలు చేకూర్చుకునేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని అలాగే గోదావరి జలాలను కూడా వినియోగించుకునేందుకు కాళేశ్వర ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశారని ఆరోపించారు. శ్రీపాదసాగర్ ప్రాజెక్టు చివరి దశకు చేరుకోలేదా…ఎస్సారెస్పీ వరద కాలువలు పూర్తి చేసి మానేర్‌ను రెండు సార్లు నింపింది కాంగ్రెస్ కాదా అని ఆయన కేసీఆర్‌ను నిలదీశారు. కాంగ్రెస్ ఎలాంటి ప్రాజెక్టులు చేయకుండా దోచుకుందని ఆరోపిస్తే గుడ్డిగా నమ్మేందుకు ప్రజలు సిద్దంగా లేరన్నారు. పార్లమెంటరీ విధానాలకు విరుద్దంగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను చేపట్టడాన్ని తాము వ్యతిరేకించామన్నారు. అదే జరిగితే ప్రతిపక్షంగా ఉన్న తమకు కూడా అదే పవర్ పాయింట్ ప్రెజేంటేషన్ అవకాశాన్ని స్పీకర్ ఇవ్వాలని కోరుతూ లేఖ రాసినా తుంగలో తొక్కాడని ఆరోపించారు. తమకు అనుమతిచ్చి ఉంటే ఆయనకంటే కూడా ప్రాణహిత-చేవెల్ల వల్ల ప్రయోజనాలు, మేడిగడ్డ వల్ల నష్టాలను అదే గూగుల్ ద్వారా ప్రజలకు చూపించేవారమన్నారు. కేవలం స్వప్రయోజనాలను తాను చూసుకోవడమే లక్ష్యంగా సిఎం కెసిఆర్ వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గోదావరి జలాలను తన సొంత జిల్లాకు తరలించే యత్నాలను ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ పేరుతో సినిమా చూపించారని అన్నారు. గోదావరి జలాలను కరీంనగర్, అదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు పూర్తిస్థాయిలో వినియోగించాలని.. ఆ తర్వాతే ఇతర జిల్లాలకు తరలించాలన్నారు. అలా కాదని వ్యవహరిస్తే ప్రజలను, రైతులను ఏకం చేసి ఉద్యమిస్తామన్నారు. ముఖ్యమంత్రి మొదటి నుంచి గోదావరి జలాలను తన జిల్లాకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.