దర్గా వద్దే రెండు రోజులు!
సూర్యాపేటలో పోలీసులను హతమార్చిన ఉగ్రవాదులు ఎజాజ్, అయూబ్‌లు రెండు రోజులపాటు? ఎక్కడున్నారు? ఏం తిన్నారు? ఏం చేశారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు పోలీసు దర్యాప్తులో బయటకు వస్తున్నాయి. నిందితులిద్దరూ రెండు రోజులు అర్వపల్లి దర్గా, గుట్టల్లోనే సంచరించినట్లు పోలీసులు దాదాపు ఓ అంచనాకు వచ్చారు. బస్టాండులో కాల్పుల అనంతరం వారు బైక్‌పై పరారై సూర్యాపేటకు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్వపల్లి గుట్టలకు చేరుకుని ఉంటారని.. మధ్యలో కొన్ని బ్రెడ్ప్యాకెట్లను కొని వెంట తీసుకెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాల్పుల తర్వాత పోలీసులు పూర్తిస్థాయిలో అప్రమత్తమవడానికి గంటపైనే సమయం పట్టింది. ఆ గంటలోపే అర్వపల్లి గుట్టలకు ఉగ్రవాదులు చేరుకుని 2, 3 తేదీల్లో అక్కడే తలదాచుకున్నారు. 2న వారు బ్రెడ్‌నే ఆహారంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అర్వపల్లి గుట్టలకు అత్యంత సమీపంలో నసీరుద్దిన్ బాబా దర్గా ఉంది. ఈ గుట్టల దగ్గర భక్తులు ప్రతి శుక్రవారం మేకపోతులను బలిగా ఇచ్చి అక్కడే సహపంక్తి భోజనాలు చేసి, అక్కడే నిద్ర చేస్తారు. శుక్రవారం ఉగ్రవాదులు ఇక్కడే భోజనం చేసినట్టు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే దర్గా ముతవల్లి మస్తాన్‌ను పోలీసులు విచారించారు. ఏప్రిల్ 4న మొదటిసారి బయటకు వచ్చి సీతారాంపురం వద్ద పోలీసులకు తారసపడ్డారు. వెంటనే తుంగతుర్తి సీఐ మీదకు శాలువాను విసిరేసి ఎస్పారెస్పీ కాలువల్లోకి జారుకున్నారు. కాలువలో నక్కి పోలీసులపై కాల్పులు జరిపారు. తర్వాత అర్వపల్లి వైపు వచ్చారు. సీతారాంపురంలో ఉగ్రవాదులకు సంబంధించి శాలువాతోపాటు కవర్లో ఉన్న బ్రెడ్ పాకెట్‌ను సీఐ స్వాధీనం చేసుకున్నారు.