దసరారోజు శూర్పణఖ దిష్టిబొమ్మ దహనం

ఔరంగాబాద్‌లో భార్యాబాధితుల వింత ఆచారం
ఔరంగాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  దసరా రోజు సాధారణంగా రావణుని దిష్టిబొమ్మలను దహనం చేయడం సహజం. కానీ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో మాత్రం కొందరు భార్యా బాధితులు రావణుడి బదులు ఆయన సోదరి శూర్పనఖ దిష్టిబొమ్మలను దహనం చేయడం విశేషం. ఔరంగాబాద్‌ సవిూపంలోని కరోలి గ్రామంలో పత్ని పీడిత్‌ పురుష్‌ సంఘటన అనే ఈ సంస్థ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. దీని వెనుక ఓ పెద్ద కారణమే ఉంది. దీనికి ఈ సంస్థ ఫౌండర్‌ భరత్‌ ఫూలారే ఇచ్చిన సమాధానం వింటే  నోరెళ్లబెట్టడం ఖాయం. ఇండియాలోని చట్టాలన్నీ పురుషులకు వ్యతిరేకంగానే ఉన్నాయి. అవన్నీ మహిళలకు అనుకూలంగా ఉన్నాయి. ఆ చట్టాలను దుర్వినియోగం చేస్తూ భార్యలు.. భర్తలను హింసిస్తున్నారు అని భరత్‌ చెప్పడం విశేషం.దేశంలో పురుషుల పట్ల ఉన్న ఈ వివక్షను మేం ఖండిస్తున్నాం. అందుకే మహిళలపై ఉన్న వ్యతిరేకతను ఇలా శూర్పనఖ దిష్టిబొమ్మను దహనం చేయడం ద్వారా చెప్పాలనుకున్నాం అని అతడు అన్నాడు. 2015 రికార్డుల ప్రకారం పెళ్లయిన జంజల్లో
ఆత్మహత్యలు చేసుకొని మరణించిన వాళ్లలో 74 శాతం పురుషులేనని భరత్‌ చెప్పాడు. హిందూ పురాణాల ప్రకారం రామరావణ యుద్ధానికి మూల కారణం ఈ శూర్పనఖే. తన చెల్లెలికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతోనే రావణుడు ఓ సన్యాసి రూపంలో వచ్చి సీతను ఎత్తుకెళ్లినట్లు పురాణాలు చెబుతున్నాయి.