దిల్‌సుఖ్‌నగర్ బాంబుపేల్లుళ్ల దోషులకు ‘ఉరే సరి’
` ఎన్‌ఐఏ కోర్టు తీర్పును సమర్ధించిన హైకోర్టు
` వారి అప్పీళ్లను తిరస్కరించిన ధర్మాసనం
` తీర్పుపై బాధితులు హర్షాతిరేకాలు
` పరారీలోనే ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్
హైదరాబాద్(జనంసాక్షి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్‌ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ ఐదుగురు దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను ఉన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఎన్‌ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది.2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని బస్టాపులో, మిర్చిపాయింట్ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ పరారీలో ఉండగా, మిగిలిన ఐదుగురు నిందితులకు ఎన్‌ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబరు 13న తీర్పు వెలువరించింది.ఉరిశిక్ష పడిన నిందితుల్లో అసదుల్లా అక్తర్ అలియాస్ హద్ది, జియా ఉర్ రహమాన్ అలియాస్ వఘాస్ అలియాస్ నబీల్ అహమ్మద్, మహ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ అలియాస్ మోను, యాసిన్ భత్కల్ అలియాస్ షారూఖ్, అజాజ్ షేక్ అలియాస్ సమర్ ఆర్మాన్ తుండె అలియాస్ సాగర్ అలియాస్ ఐజాజ్ సయ్యద్ షేక్ ఉన్నారు. అనంతరం ఉరిశిక్ష ధ్రువీకరణ నిమిత్తం ఎన్‌ఐఏ కోర్టు తీర్పును హైకోర్టుకు నివేదించింది. దీంతోపాటు ఐదుగురు నిందితులు కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ పి.శ్రీసుధలతో కూడిన ధర్మాసనం సుమారు 45 రోజులపాటు సుదీర్ఘ విచారణ జరిపి తీర్పు వాయిదా వేసింది. నేడు ఎన్‌ఐఏ కోర్టు తీర్పును సమర్థిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు హైకోర్టు తీర్పుపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచారు.