దివాళా దిశగా జెట్‌ ఎయిర్‌వేస్‌

జీతాలు తగ్గించుకోవాలని పైలట్లకు సూచన

న్యూఢిల్లీ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ లిమిటెడ్‌ దివాళా తీసే పరిస్థితుల్లో ఉంది. కంపెనీలోని పైలట్లు తమ జీతాలు తగ్గించుకోవడంతోపాటు ఇతర ఖర్చులు తగ్గించకపోతే 60 రోజుల్లోనే కంపెనీ మూతపడే ప్రమాదం ఉందని ఆ సంస్థ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వెల్లడించారు. పైలట్లు తమ జీతాలను 15 శాతం మేర తగ్గించుకోవాలని రెండేళ్లుగా జెట్‌ ఎయిర్‌వేస్‌ కోరుతూ వస్తున్నా.. వాళ్లు అందుకు నిరాకరించారు. దీంతో ఎయిర్‌లైన్స్‌ మరిన్ని కష్టాల్లో కూరుకుపోయింది. సేల్స్‌, డిస్టిబ్య్రూషన్‌, పేరోల్‌, మెయింటనెన్స్‌లాంటి వాటిలో ఖర్చులు తగ్గించే పనిలో సంస్థ ఉంది. దీనికి సంబంధించి అందరు భాగస్వాములతో యాజమాన్యం చర్చిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ రుణాల కోసం ప్రయత్నిస్తున్నా.. సంస్థ మళ్లీ లాభాల్లోకి వస్తుందన్న హావిూ ఇవ్వాలని బ్యాంకులు స్పష్టంచేస్తున్నాయి.అందులో భాగంగానే జీతాల్లో కోత విధించాలని చూస్తున్నది. సంస్థలో కొన్ని కిందిస్థాయి ఉద్యోగులను తొలగించే పని కూడా మొదలుపెట్టనుంది. ఈ ఎయిర్‌లైన్స్‌ షేర్లు కూడా శుక్రవారం 4.2 శాతం మేర పతనమయ్యాయి. నిజానికి విమాన ఇంధన ధరలు పెరగడం, రూపాయి బలహీనపడటం భారత ఎయిర్‌లైన్స్‌ సంస్థలను దెబ్బతీస్తున్నది. దేశంలోనే పెద్దదైన ఎయిర్‌లైన్స్‌ ఇండిగో కూడా తమ లాభాలు 97 శాతం మేర క్షీణించాయని ప్రకటించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ తమ లాభాలను పెంచుకునేందుకు దేశీయ రూట్లపై దృష్టిసారిస్తున్నది. దీనికోసం ప్రత్యేకంగా 75 బోయింగ్‌ 737 మ్యాక్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం ఆర్డర్‌ ఇచ్చింది. దీని ద్వారా సంస్థ సామర్థ్యం పెంచుకోవడంతోపాటు ఖర్చులు తగ్గి, సంస్థ పోటీలో ఉంటుందని జెట్‌ ఎయిర్‌వేస్‌ భావిస్తున్నది