దుప్పిని అడవిలో వదిలిన అటవీ అధికారులు

జూలూరుపాడు, ఆగష్టు 18, జనంసాక్షి:
అడవి నుంచి తప్పిపోయి మేతకు వెళ్లిన మేకల గుంపులో కలిసి చుక్కల దుప్పి బుధవారం సాయంత్రం జనారణ్యంలోకి వచ్చింది. మండల కేంద్రంలోని చర్చి కాంపౌండ్ లోని విశాలమైన ఆవరణలో దుప్పి గెంతులు వేస్తుండటంతో పిల్లలు, పెద్దలు చూసేందుకు ఉత్సాహం చూపారు. కొందరు వీడియోలు తీశారు. ఆ తర్వాత కోయ కాలనీ వైపు దుప్పి పరుగులు తీసింది. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ ప్రసాదరావు, తన సిబ్బందితో కలిసి దుప్పి కోసం వెతికారు. ఎట్టకేలకు కొందరు యువకుల సహకారంతో దుప్పిని పట్టుకుని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. చిన్న చిన్న గాయాలు కావడంతో దుప్పికి వైద్యం అందించి సంరక్షణ చర్యలు తీసుకున్నారు. దుప్పి ఆరోగ్య పరిస్తితి మెరుగుపడటంతో, కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కార్యాలయం నుంచి వచ్చిన ప్రత్యేక సిబ్బంది సహకారంతో చీమలపాడు అడవుల్లో గడ్డి మైదానాలు ఉన్న అటవీ ప్రాంతంలో గురువారం దుప్పిని క్షేమంగా వదిలిపెట్టినట్లు ఎస్ఆర్వో ప్రసాదరావు తెలిపారు.