దుర్గగుడి పాలక మండలి కీలక నిర్ణయాలు
చిన్నారులకు ఉచితంగా పాలు.. భక్తులకు ఉచిత ప్రసాదం
విజయవాడ,ఆగస్టు25(జనం సాక్షి ): ఇకపై చిన్నారులకు ఆలయం తరఫున ఉచితంగా పాలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు దుర్గగుడి ఆలయ ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఉచిత ప్రసాదంగా అప్పాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆలయ ఈవోగా కోటేశ్వరమ్మ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయ ఛైర్మన్ గౌరంగబాబు, పాలక మండలి సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.సమావేశం వివరాలను ఈవో వెల్లడించారు. ఈవోగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లోనే భక్తుల సమస్యకు పరిష్కారంపై దృష్టి సారించానని చెప్పారు. వైదిక కమిటీలో ఎవరు ఉండాలనేది అర్చకులంతా కలిసి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు సేద తీరేందుకు చర్యలు చేపట్టామని, రెండు చోట్ల షెడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. పార్కింగ్ సమస్య అధిగమించేందుకు శివాలయం మెట్ల దిగువన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భద్రతా చర్యల్లో భాగంగా గుడి పరిధిలో ఆధునిక కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాదరక్షల కౌంటర్ వద్ద సిబ్బంది డబ్బులు వసూలు చేయకుండా నియంత్రించామని చెప్పారు.
—————-