దేశంలో నానాటికి పెరుగుతున్న నిరుద్యోగం

ఉద్యోగ ఖాళీలు ఏటేటా పెరుగుతున్నాయి
రాజ్యసభలో ప్రస్తావించిన ఎంపి విజయసాయి
న్యూఢల్లీి,ఫిబ్రవరి8(జనం సాక్షి): దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతుందని రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ రంగాలలో భర్తీ చేయని ఉద్యోగ ఖాళీలు లక్షల సంఖ్యకు చేరుకుంటున్నాయని, ఇది చాలా విచిత్రమైన పరిస్థితి తెలిపారు. రాజ్యసభలో మంగళవారం జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంలో భర్తీకాని ఉద్యోగ ఖాళీల గురించి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం 8 లక్షల ఉద్యోగ ఖాళీలు నేటికీ భర్తీ కాలేదని అన్నారు. ఇందులో సైన్యంలోని త్రివిధ దళాల్లో లక్షకు పైగా ఉద్యోగాలు, రైల్వేలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ఉద్యోగ ఖాళీల ప్రకటన, పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అసాధారణ జాప్యంతోపాటు రిక్రూట్‌మెంట్‌ కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలు ప్రకటించడంలోను, నియామక పక్రియను పూర్తి చేయడంలో కూడా తీవ్ర జాప్యం చేసుకుంటోందని అన్నారు. అలాగే రిక్రూట్‌మెంట్‌ ప్రశ్నా పత్రాలు లీక్‌ కావడం, వివిధ రిక్రూట్‌మెంట్‌ బోర్డుల్లో జరుగుతున్న
అవకతవకలపైన కోర్టుల్లో ఏళ్ళ తరబడి కొనసాగుతున్న దావాలు వంటి కారణాలతో ఏడాదిలో పూర్తి కావలసిన నియామక పక్రియ రెండు, మూడేళ్ళు గడిచినా పూర్తి కావడం లేదని విజయసాయి రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో రిక్రూట్‌మెంట్‌ పరీక్షల కోసం ఏళ్ళ తరబడి రేయింబవళ్ళు కష్టపడుతన్నారని తెలిపారు. నిర్ణీత కాల వ్యవధిలో ఉద్యోగాల భర్తీ పక్రియను పూర్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాశీన వైఖరి వలన లక్షలాది మంది యువతీ యువకుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతోందని విజయసాయి రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇక్కట్లను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వంలోని వివిధ ఖాళీలను భర్తీ చేయడానికి నిర్దుష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే భవిష్యత్తులో నిర్ణీత కాలవ్యవధిలో అన్ని ఖాళీలను భర్తీ చేయడానికి వీలుగా ఒక పటిష్టమైన విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.