దేశం గొప్ప నాయకున్ని కోల్పోయింది

– విలువలకు కట్టుబడి రాజకీయాలు చేసిన వ్యక్తి వాజ్‌పేయి
– వాజ్‌పేయిను ఆదర్శంగా తీసుకొని ముందకు సాగాలి
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
– వాజ్‌పేయి భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం
న్యూఢిల్లీ, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి భౌతికకాయానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు కృష్ణవిూనన్‌ మార్గ్‌లోని వాజ్‌పేయి నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయన పార్థివ దేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించిన అనంతరం విూడియాతో మాట్లాడుతూ.. దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. ఎన్నో సంస్కరణలకు ఆద్యుడు వాజ్‌పేయి అని కొనియాడారు. టెలికమ్యూనికేషన్‌ రంగం, ప్రయివేటీకరణ, దేశ ఆర్థికాభివృద్ధిలో ఆయన ఎనలేని సేవలు చేశారని బాబు పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌ అభివృద్ధికి ఎంతో సహకరించారని చంద్రబాబు తెలిపారు. అధికార, ప్రతిపక్షాల్లో వాజ్‌పేయికి సాటి మరెవ్వరూలేరని అన్నారు. విలువలకు కట్టుబడి నమ్ముకున్న సిద్ధాంతాలను, ఆదర్శాలను నిజ జీవితంలో ఆచరించి చూపిన గొప్ప మానవతావాది.. ఎంపీ, ప్రధాన ప్రతిపక్షనేత, విదేశాంగమంత్రి, ప్రధానమంత్రిగా బహుముఖ పాత్ర పోషించిన ఉదారవాదని కొనియాడారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఆరున్నరేళ్లు నడిపిన ఘనత వాజ్‌పేయికి సొంతమని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలోనూ తన నిర్ణయాన్ని పక్కనబెట్టి మితపక్షాల మాటకే విలువనిచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా పీసీ అలెగ్జాండర్‌ను వాజ్‌పేయి ఎంపిక చేసినప్పుడు ఎన్డీఏలోని మిత్రపక్షాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాయని, ఇదే విషయాన్ని ఆయనకు చెప్పడంతో సానకూలంగా స్పందించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతేకాదు ఎవరైతే బాగుంటుందో భాగస్వామ్య పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పి అబ్దుల్‌ కలామ్‌ పేరును ప్రతిపాదించడంతో సంకీర్ణ ధర్మానికి విలువ ఇచ్చారని పేర్కొన్నారు. నదుల అనుసంధానం, స్వర్ణ చతుర్భుజి నిర్మాణం ఆయన ఆలోచనలే.. మంచి నిర్ణయంపై సానుకూలంగా ఆలోచించడం ఆయన నైజమని, ఇలాంటి గొప్ప గుణం ఇతరుల్లో కనిపించదని అన్నారు. జాతీయ రహదారి అభివృద్ధి, వెలుగు ప్రాజెక్టుకు ప్రపంచబ్యాంకు నిధులు, ఐటీ రంగం అభివృద్ధి, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్‌
రింగ్‌రోడ్డు నిర్మాణంలో వాజ్‌పేయీ సహకారం మరువలేనిదని అన్నారు. ఆయనతో విభేదించినా వాటిని ఎప్పుడూ మనసులో పెట్టుకోకుండా హుందాగా వ్యవహరించేవారని చంద్రబాబు గుర్తుచేశారు.