దేశం మహానేతను కోల్పోయింది

తమిళనాడును అగ్రశేణిగా తీర్చిదిద్దిన కరుణానిధి

– ఏపీ సీఎం చంద్రబాబు నివాళి

విజయవాడ,ఆగస్టు8(జ‌నం సాక్షి): తమిళనాడును అగశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కరుణానిధి సేవలు అసమానమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీర్తించారు. దక్షిణభారత దేశంలో పెద్ద రాజకీయ శక్తిగా ఆయన అవతరించారని అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నోడల్‌ అధికారుల రాష్ట్రస్థాయి సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు. సభికులతో కలిసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. తమిళ ప్రజలు, కరుణానిధి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరుణానిధి రాటుదేలిన రాజకీయ వేత్త. కోట్ల మందిని ప్రభావితం చేసిన విలక్షణ నాయకుడని కొనియాడారు. తమిళనాడులో తిరుగులేని నేత అని, దక్షిణ భారతదేశంలో పెద్ద రాజకీయ శక్తిగా ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగారన్నారు. రాజకీయ రంగంలోనే కాకుండా కళా రంగంలోనూ తనదైన ప్రత్యేకత చాటుకున్నారని తెలిపారు. ఎన్నో సామాజిక మార్పులకు నాంది పలికారని, కరుణానిధితో నాకు మంచి అనుభవం ఉందని చంద్రబాబు గుర్తు చేసుకున్నాడు. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో ఆయన చాలా సన్నిహితంగా మెలిగేవారని, 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసినప్పుడు కరుణానిధి అండగా నిలిచారన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని ఏర్పాటుచేసుకున్న కరుణానిధి చనిపోవడం తమిళనాడుతో పాటు దేశానికి తీరని లోటని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్రవిడ, హిందీ వ్యతిరేక ఉద్యమంలో కరుణానిధి కీలక భూమిక పోషించారన్నారు. దేవెగౌడ, గుజ్రాల్‌ ప్రభుత్వాల ఏర్పాటులో కరుణానిధిది ప్రధాన పాత్ర అని తెలిపారు. ఎన్టీఆర్‌కు కరుణానిధి అత్యంత సన్నిహితుడని సీఎం గుర్తుచేశారు. నమ్మిన సిద్దాంతం కోసం పోరాడిన వ్యక్తి కరుణానిధి అని కొనియాడారు. గొప్ప పరిపాలనా దక్షుడు, సామాజిక ఉద్యమ నేత కరుణానిధి అని సీఎం చంద్రబాబు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రులు లోకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

———————————

 

తాజావార్తలు