దేశమా.. మతమా? ` ఏది సర్వోన్నతం..
` మండిపడ్డ మద్రాస్ హైకోర్టు
చెన్నై,ఫిబ్రవరి 10(జనంసాక్షి): దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కర్నాటకలో హిజబ్ వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో .. ఇవాళ ఓ పిల్‌పై హైకోర్టు యాక్టింగ్ సీజే ఎంఎన్ భండారి స్పందిస్తూ.. దేశం ముఖ్యమా లేక మతమా అని ఆయన ప్రశ్నించారు. ఏది సర్వోన్నతమని ఆయన అడిగారు. డ్రెస్ కోడ్‌కు సంబంధించిన పిల్‌పై ద్విసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఆ సమయంలో సీజే భండారి షాక్ వ్యక్తం చేశారు. కొందరు హిజబ్ వేసుకుంటున్నారు, కొందరు టోపీలు ధరిస్తున్నారు, కొందరు వారికి నచ్చిన దుస్తులు వేసుకుంటున్నారని, ఇంతకీ ఇది ఒకే దేశమా లేక మతం ఆధారంగా విభజనకు గురైందా లేక ఇంకామైనానా అని ఆయన ప్రశ్నించారు. ఇది సర్‌ప్రైజింగ్‌గా ఉందన్నారు.భారత్ సెక్యులర్ దేశమని, ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే, దేశాన్ని మతం ఆధారంగా విభజించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోందని యాక్టింగ్ సీజే అన్నారు. తిరుచురాపల్లి జిల్లాకు చెందిన రంగరాజన్ నరసింహన్ అనే వ్యక్తి పిల్ వేశారు. ఆ పిల్‌ను మద్రాస్ హైకోర్టు విచారించింది. ఆలయాలకు వెళ్లే భక్తులకు కఠినమైన డ్రెస్ కోడ్‌ను అమలు చేయాలని, హిందువులు కాని వారికి ఆలయ ప్రవేశాన్ని నిషేధించాలని ఆ పిల్‌లో కోరారు. హిందువులు కానివారిని ఆలయాలకు రాకుండా చేసేందుకు గుళ్ల వద్ద డిస్‌ప్లే బోర్డులు పెట్టాలన్నారు. అయితే నిర్ధిష్టమైన డ్రెస్ కోడ్ లేనప్పుడు ఎలా డిస్‌ప్లే బోర్డులు పెడుతారని ధర్మాసనం ప్రశ్నించింది.