దేశీయ మార్కెట్ల జోరుకు అడ్డుకట్ట

– నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు
ముంబయి, ఆగస్టు29(జ‌నం సాక్షి) : దేశీయ మార్కెట్ల లాభాల జోరుకు అడ్డుకట్ట పడింది. ఆగస్టు డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియనున్న వేళ మదుపర్లు షార్ట్‌ కవరింగ్‌కు మొగ్గుచూపారు. దీనికి తోడు ఆసియా మార్కెట్ల మిశ్రమ సంకేతాలు, బ్యాంకింగ్‌, ఐటీ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో బుధవారం నాటి ట్రేడింగ్‌లో చాలా సేపు ఊగిసలాడిన సూచీలు.. చివరకు నష్టాలను మూటగట్టుకున్నాయి. బుధవారం ఉదయం సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో స్వల్ప లాభంతో సరికొత్త రికార్డులను తాకాయి. అయితే ఆ లాభాలు ఎంతోసేపు నిలువలేదు. మార్కెట్‌ ఆరంభంలో 90 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఆ తర్వాత కూడా చాలాసేపు లాభనష్టాల్లో ఊగిసలాడింది. ఇక చివరి గంటల్లో రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ లాంటి దిగ్గజ కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 200 పాయింట్ల వరకు దిగజారింది. నిఫ్టీ కూడా 10,700 మార్క్‌ను కోల్పోయింది. మొత్తం విూద బుధవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 174 పాయింట్లు నష్టపోయి 38,723 వద్ద, నిఫ్టీ 47 పాయింట్ల నష్టంతో 11,692 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా పతనమైంది. బుధవారం డింగ్‌లో 35 పైసలు పడిపోయి రూ. 70.45గా కొనసాగుతోంది.
ఎన్‌ఎస్‌ఈలో యూపీఎల్‌ లిమిటెడ్‌, బజాజ్గ్‌/నాన్షియల్‌ సర్వీసెస్‌, ఎస్‌బీఐ, ఓఎన్జీసీ, గెయిల్‌ షేర్లు లాభపడగా.. కోల్‌ఇండియా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, లుపిన్‌, రిలయన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.