దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు
ప్రధాని మోడీ విలాసాలతో గడుపుతున్నారు
ధరల పెరుగుదలతో సామాన్యుల జీవితాలు అతలాకుతలం
ప్రధాని మోడీ తీరుపై మండిపడ్డ మాజీమంత్రి చింతా మోహన్
విజయనగరం,నవంబర్2 జనంసాక్షి : దేశంలో పరిస్థితులేవీ బాగోలేవని కాంగ్రెస్ నేత మాజీ కేంద్ర సహాయక మంత్రి చింతా మోహన్ అన్నారు. నిత్యావసర ధరలు బాగా పెరిగిపోతున్నాయని, కోడి గుడ్డు దగ్గర నుండి పెట్రోల్ వరకు ధరలన్ని ఆకాశాన్ని అంటుతున్నాయని, సామాన్యుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆవేదన చెందారు. మంగళవారం ఉదయం విజయనగరం పట్టణంలో చింతా మోహన్ మాట్లాడుతూ… దేశంలో పరిస్థితులు బాగాలేవన్నారు. దేశంలో ఒకవైపు ఆకలి చావులు ఉంటే ప్రధాని
మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని ధ్వజమెత్తారు. 16 వేల కోట్ల రూపాయలను పెట్టి ఖరీదైన 2 విమానాలు కొన్నారని, దేశంలో అన్నం లేక జనం ఛస్తుంటే …వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. నెహ్రూ తన వేసుకున్న కోటు చిరిగిపోతే ఆయనే స్వయంగా కుట్టుకున్నారని గుర్తు చేశారు కానీ ప్రస్తుత ప్రధానికి మాత్రం రూ.50 కోట్ల 5 వెల్ డ్రెస్ లు ఉన్నాయని చెప్పారు. బిజెపి అధికారంలో ఉన్న 7 ఏళ్లలో దేశాన్ని దోచుకుందని అన్నారు. మధ్యతరగతి కుటుంబాలు అల్లాడిపోతున్నాయని, పాకిస్థాన్ లో లేని ఆకలికేకలు భారత్ లో కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఆర్ధిక అసమానతలు బాగా పెరిగిపోతున్నాయన్నారు. మనిషి వాడుకునే ప్రతి వస్తువు ధర పెరుగుతుందని, వంద రూపాయలు సంపాదించలేని సామాన్యుడు ఒకవైపు అయితే.. మరోవైపు వెయ్యి కోట్ల రూపాయలను సంపాదిస్తున్న ప్రధాని స్నేహితుడు ఉన్నారని.. దేశంలో అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తూ అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. గుజరాత్ పోర్టులో ప్రధాని స్నేహితుడి వద్ద రూ.20 వేల కోట్ల విలువ చేసే 3 వేల కిలోల హెరాయిన్‌ను పట్టుకుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. అని ప్రశ్నించారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఏవిూ చేసాడో తెలీదు, అతడిని పట్టుకుపోయారు. మైనారిటీకి ఒక రూల్….ప్రధాని స్నేహితులకి ఒక రూలా ? అని చింతా మోహన్ అడిగారు. నిరుద్యోగ సమస్య ను తీర్చాలని అడిగితే పట్టించుకునే పరిస్థితి లేదని, దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వాళ్లకు అమ్ముకుంటున్నారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి మొత్తం నిర్వీర్యం చేస్తున్నారన్నారన్నారు. ఎపి పరిస్థితులు అస్సలు బాలేవని, వెనుకబడిన వర్గాలకు 27 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. దేశం అంతటా స్కాలర్ షిప్ లు ఇస్తుంటే ఎపి లో మాత్రం ఆపడం దుర్మార్గమన్నారు. రెండున్నర ఏళ్లుగా కేంద్రం ఇస్తున్న స్కాలర్ షిప్ లు ఎక్కడికి పోతున్నాయి ? రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని చింతా మోహన్ ప్రశ్నించారు. దీపావళి లోపు స్కాలర్ షిప్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సి, ఎస్టీలలో ఆర్థిక అభివృద్ధి కోసం ్గªనాన్స్ కార్పొరేషన్ తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సి, ఎస్టీ, ఓబీసీ ్గªనాన్స్ కార్పొరేషన్ పున్ణప్రారంభం చేయాలని కోరారు. కార్పొరేషన్‌లను మూసేసి అధికారులకు జీతాలు ఇవ్వడం దుర్మార్గమన్నారు. ఎపి లో రాజకీయం చూస్తే బాధాకరంగా ఉందని, రెండు సామాజిక వర్గాలు టేబుల్ టెన్నిస్ ఆడుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. 3 శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గంవారు 45 ఏళ్ళు పరిపాలించారు. 3 శాతం ఉన్న కమ్మ సామాజికవర్గం వాళ్ళు 27 ఏళ్ళు పరిపాలించారు.. కానీ 80 శాతం ఉన్న వెనుకబడిన సామాజిక వర్గాల వారికి రాజ్యాధికారం దక్కనేలేదు అని ఆవేదన చెందారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి కాపులకు రాజ్యాధికారం అందేలా చేస్తానని హావిూ ఇచ్చారు. 2024లో కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తపరిచారు. నెహ్రూ దేశాన్ని సోషలిజం వైపు తీసుకెళ్తే మోడి క్యాపిటలిజం వైపు తీసుకెళుతున్నారని చింతా మోహన్ ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకాన్ని ఆపగలిగే శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పారు. అధికారంలో ఉన్న జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కలిసి ప్రధానిని ఎందుకు ప్రశ్నించకలేకపోతున్నారని నిలదీశారు. వారం రోజుల్లో పవన్ ఏదో చేస్తా అన్నాడు… పవన్ వల్ల ఏమి కాదు.. 2024లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వపరం చేసి తీరుతాం.. అని వక్కాణించారు. ’రాజకీయంగా ఏదైనా జరగచ్చు.. ప్రధాని తలుచుకుంటే ఒక్కరోజు పని. రాజకీయ పక్రియతో విడిపోయిన రాష్టాన్ని తిరిగి ఒకటి
చేయచ్చు..’ అని అన్నారు. విజయనగరం జిల్లా బబ్బిలి నుండి తనకు మంచి అనుబంధం ఉందని, ట్రస్ట్ నుండి బబ్బిలిరాజులు స్కాలర్ షిప్స్ అందించారని, ఆ స్కాలర్ షిప్స్ ద్వారానే తాను చదువుకున్నానని గుర్తుచేసుకున్నారు. బబ్బిలి రాజులను కాంగ్రెస్‌లోకి రావాలని చింతా మోహన్ కోరారు.