దొరల పాలనలో సామాన్యులకు కష్టాలు: మోత్కుపల్లి

కరీంనగర్‌,మార్చి3(జ‌నంసాక్షి): ఏ పార్టీ అయిన ప్రధానంగా బడుగు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తుందని, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం ధనిక వర్గాలకు పెద్ద పీట వేస్తున్నారని టీ.టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. మంగళవారం కరీంనగర్‌లోని అంబేద్కర్‌ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ప్రతినిధుల సభలో మోత్కుపల్లి మాట్లాడుతూ కేసీఆర్‌ దొరల పాలన సాగిస్తున్నారని అన్నారు. ఏ పేద ప్రజలు ఈరోజు గ్రామాల్లో మాట్లాడే పరిస్థితి లేదని, కేసీఆర్‌ దొరికే పరిస్థితి లేదని, ఎక్కడికైనా హెలీకాఫ్టర్‌లో రావడం తప్పితే… తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారిని పరామర్శించే సమయం కూడా కేసీఆర్‌కు లేదని మోత్కుపల్లి ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం 12 వందల మంది బిడ్డలు ప్రాణ త్యాగం చేశారని, వారు త్యాగాలు చేసింది. దొరల పాలన కోసం కాదని, బడుగు బలహీన వర్గాల కోసమని, ముఖ్యంగా దళితుడుని ముఖ్యమంత్రిని చేస్తానంటేనే వారు పోరాటం చేసి, త్యాగాలు చేశారని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ రోజుకోమాట మాట్లాడుతున్నారని, ఆంధ్రావాళ్లను తరిమికొట్టాలని పిలుపు ఇచ్చిన కేసీఆర్‌ ఇప్పుడు హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికలు

జరగనున్న నేపథ్యంలో ఆంధ్రావాళ్లు నావాళ్లని, వారిని గుండెల్లో పెట్టుకుంటామని చెబుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో మూడేళ్ళవరకు కరెంట్‌ ఇబ్బందులు ఉంటాయని కేసీఆరే స్వయంగా చెబుతున్నారని, ఇంతకు ముందు ఈ సమస్య ఉందా? అని మోత్కుపల్లి ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో 9 గంటలు విద్యుత్‌ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుదే అని ఆయన చెప్పారు. లోటు బడ్జెట్‌తో ప్రారంభమైన ఏపీలో ఈరోజున 24 గంటలు కరెంట్‌ ఇస్తున్నారని, మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణలో మాత్రం కేసీఆర్‌ విద్యుత్‌ ఇవ్వలేకపోతున్నారని మోత్కుపల్లి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.