దోషిగా తేలకుండా రాజకీయవేత్తను ఎన్నికల్లో నిషేధించలేం

నేరారోపణలు ఉన్న అభ్యర్థుల విషయంలో చట్టాలు ఉన్నాయి

సుప్రీంకు నివేదించిన కేంద్రప్రభుత్వం

న్యూఢిల్లీ,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): నేరారోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలన్న అంశంపై మంగళవారం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. దీని వెనుక ఉద్దేశాలు సరైనవే అయినా.. దోషిగా తేలకుండా నిషేధం విధించడం, అలాంటి అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టకుండా ఉండాలని పార్టీలను ఆదేశించడం సరికాదని కేంద్రం స్పష్టంచేసింది. అలాంటి అభ్యర్థులను ఎప్పుడు, ఎలా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలో చెప్పే చట్టాలు ఉన్నాయని, కోర్టులు కొత్త నిబంధనలు విధించాల్సిన అవసరం లేదని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ కేసును విచారిస్తున్న రాజ్యాంగ ధర్మాసనానికి తెలిపారు. అత్యాచారం, హత్య, అవినీతిలాంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టకూడదన్న రాజ్యాంగ ధర్మాసనం సూచనను అటార్నీ జనరల్‌ తప్పుబట్టారు. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది. విూ ఉద్దేశం మంచిదే. కానీ కోర్టులు ఇలాంటివి చెప్పడం ఎంతవరకు సమంజసం. ఇది కచ్చితంగా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుంది. అంతేకాదు రాజకీయ పార్టీల స్వేచ్ఛను కూడా హరిస్తుంది అని కేకే వేణుగోపాల్‌ స్పష్టంచేశారు. అయితే అలాంటి వ్యక్తులకు పార్టీలు టికెట్‌ ఇవ్వకపోయినా.. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం ఇవ్వడం కూడా పరిశీలించవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే అటార్నీ జనరల్‌ దీనిని కూడా అంగీకరించలేదు. అది రాజకీయ పార్టీల విచక్షణకే వదిలేయాలి. ఒకవేళ ఆ పార్టీలు కోర్టు ఆదేశాలను పాటించకపోయినా.. అది కోర్టు ఉల్లంఘన కిందికి కాదు. ఎందుకంటే రిజిస్టర్‌ అయిన పార్టీలకు ఇది వర్తించదు. దానికోసం మరో చట్టం చేయాల్సి ఉంటుంది అని వేణుగోపాల్‌ వివరించారు. అయితే తాము రాజకీయ పార్టీలను డీరిజిస్టర్‌ చేయాలనో, వాళ్ల గుర్తును రద్దు చేయాలనో చెప్పడం లేదని, ఓ రాజకీయ పార్టీగా వాళ్ల బాధ్యతను గుర్తుచేస్తున్నామని ధర్మాసనం స్పష్టంచేసింది. ఓ వ్యక్తిపై తీవ్ర నేరారోపణలు ఉన్నపుడు ఇలా చేస్తే తప్పేముంది అని ప్రశ్నించింది. అయితే పోటీ చేసే హక్కును కూడా పరిగణనలోకి తీసుకోవాలని, దోషిగా తేలకముందే వాళ్ల హక్కును కాలరాయడం సరికాదని వేణుగోపాల్‌ వాదించారు. న్యాయ పక్రియ చాలా సుదీర్ఘమైనదని, అందుకే ఓ వ్యక్తిని అన్యాయంగా ఇరికించినా అతడు మళ్లీ బయటపడే అవకాశం ఉంటుందని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, చర్చలు ఇంకా నడుస్తున్నాయని కూడా వేణుగోపాల్‌ ధర్మాసనానికి తెలిపారు. వాదనలు విన్న తర్వాత కోర్టు తన తీర్పును వాయిదా వేసింది.