ద్రవిడ ఉద్యమ నేత కరుణానిధి

చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో చెరిగిపోని ముద్ర వేసిన కరుణానిధి శకం ముగిసింది. ఆయన ఐదుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేయటమేకాదు.. 13 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. కరుణానిధి మరణంతో తమిళనాడు వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

కరుణానిధి ప్రస్థానం… 
జూన్ 3, 1924 న అప్పటి అవిభక్త తంజావూర్ జిల్లాలోని తిరుకువళైలోని ఓ నాదస్వర విద్వాంసుల కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు ముత్తు వేలన్, తల్లిపేరు అంజుగమ్మ. తమిళ నాయీబ్రాహ్మణ కులానికి చెందిన కరుణానిధి అసలు పేరు దక్షిణా మూర్తి. వీరి పూర్వికులు ప్రకాశం జిల్లా నుంచి వచ్చినట్లుగా చెబుతుంటారు. ద్రావిడోద్యమంలో భాగంగా హేతువాదులైన ద్రావిడ నాయకులు మతపరమైన పేర్లను త్యజించిన తరుణంలో ఆయన సొంత పేరును కరుణానిధిగా మార్చుకున్నారు.

కరుణకు షణ్ముగ సుందరాంబాళ్‌, పెరియనాయమ్మాళ్‌ అనే చెల్లెళ్లుండేవారు. 8వ తరగతివరకు మాత్రమే చదువుకున్న కరుణకు ఆది నుంచి ఉద్యమాలన్నా, సాహిత్యమన్నా ఎనలేని మక్కువ. మూఢ విశ్వాసాల నుంచి, తనకు తెలిసిన ప్రపంచం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆయన చిన్ననాటి నుంచే రకరకాల నాటికలు వేసేవారు. నాటికల రచనతో పాటు తన స్నేహితులతో కలిసి స్వయంగా నాటికల ప్రదర్శన చేసేవారు కూడా. జస్టిస్‌ పార్టీ నాయకుడు అళగిరిస్వామి ప్రసంగాలకే ఉత్తేజితుడై 14 ఏళ్ల ప్రాయంలోనే ఆయన హిందీ వ్యతిరేకోద్యమంలో పాల్గొన్నారు. హిందీకి వ్యతిరేకంగా నిరసన కార్య క్రమాలు చేపట్టి పలుమార్లు అరెస్టయ్యారు. స్వయంప్రకటిత నాస్తికుడైన కరుణానిధి ఈ.వి.రామస్వామి నాయకర్ అనుయాయి.

తమిళ సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసిన వ్యక్తి కరుణానిధి. పద్యాలు, నాటికలు, లేఖలు, నవలలు, జీవిత చరిత్రలు, సినిమాలు, సంభాషణలు, పాటలు మొదలైన అన్ని రంగాల్లో ఆయనకు ప్రవేశం ఉంది. దక్షిణ భారత చలన చిత్ర సీమ నుంచి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి కరుణానిధి. 1942లో ‘మురసోలి’ అనే పత్రికను కూడా నడిపారు.

కరుణానిధి తన 14వ ఏటనే నాటకాలు, కవిత్వం రాయడం ప్రారంభించారు. పెళ్లయిన తర్వాత ద్రావిడ నడిగర్‌ కళగం(ద్రావిడ నటుల బృందం)లో నాటక రచయితగా జీవితాన్ని ప్రారంభించారు. అయితే, ఆ నాటకాల్లో కరుణ కూడా నటించాలని ఆ సంఘం వారు షరతు విధించారు. దీంతో తన ఇద్దరు మిత్రులతో కలిసి నాటకానికి నెల రోజుల ముందుగా వెల్లుపూర్‌ వెళ్లారు. అక్కడ నాటక ట్రూప్‌ మేనేజర్‌ చూపించిన ఓ చిన్న గదిలో ఉన్నారు. రిహార్సల్‌ అనంతరం ‘పళనియప్పన్‌’ నాటకాన్ని వేశారు. కొన్ని ప్రదర్శనలకు పెరియార్‌ రామస్వామి, అన్నాదురైలు కూడా వచ్చి వీక్షించారు. అయితే ఆ నాటకం పెద్దగా రక్తికట్టలేదు. అలా ప్రదర్శనలిస్తూ ‘తొజిలాలర్‌ మిత్రన్‌’ అనే తమిళ పత్రికలో ఓ వ్యాసం రాశారు. దానికి ‘దట్‌ పెన్‌’ అని పేరు పెట్టారు. కాంగ్రెస్‌ పార్టీని విమర్శించేలా ఆ వ్యాసం ఉండటంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు చేసిన దాడిలో కరుణానిధి గాయపడ్డారు. అనంతరం జరిగిన పరిణామాలతో పెరియార్‌ వెంట నడిచారు కరుణానిధి. ఈరోడ్‌లోని పెరియార్‌ మ్యాగజైన్‌ ‘కుడియరసు’లో కరుణానిధి అసిస్టెంట్‌ ఎడిటర్‌గా చేశారు. అక్కడ ఏడాది పాటు మ్యాగజైన్‌కు వ్యాసాలు, కథలు రాస్తూ గడిపారు.

ఆ సమయంలో కోయంబత్తూరులో ప్రసిద్ధి చెందిన చలనచిత్ర నిర్మాణ సంస్థ ‘జుపిటర్‌ పిక్చర్స్‌’ నుంచి పిలుపు రావడంతో అందులో స్క్రిప్ట్‌ రైటర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. 1947లో తొలిసారి ‘రాజకుమారి’ అనే చిత్రానికి సంభాషణలు రాశారు. ఇదే సినిమాలో ఎంజీఆర్‌ తొలిసారి నటించడం విశేషం. తర్వాత ‘అభిమన్యు’కు మాటలు రాసిన కరుణానిధి.. 1952లో వచ్చిన ‘పరాశక్తి’ సినిమాతో సంభాషణలు రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు, నటుడు శివాజీ గణేశన్‌కు ఈ చిత్రం పాపులారిటీని తెచ్చింది. ఆ తర్వాత ‘మనోహర‌’తో కరుణానిధి పేరు మార్మోగిపోయింది. అలా ‘మంత్రి కుమారి’, ‘పుదైయల్‌’, ‘పూంబుహార్‌’, ‘నేతిక్కుదండనై’, ‘చట్టం ఒరు విలయాట్టు’, ‘పాసం పరవైగల్‌’, ‘పొరుత్తుపొదుం’ తదితర చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఆయన చివరిగా 2011లో త్యాగరాజన్‌ దర్శకత్వంలో ప్రశాంత్‌ కథానాయకుడిగా నటించిన ‘పొన్నార్‌ శంకర్‌’ చిత్రానికి కథ అందించారు. ఇలా ఆయన కెరీర్‌లో మొత్తం 39 సినిమాలకు స్క్రిప్ట్‌ను అందించారు.

కేవలం సినిమాలకు సంభాషణలు మాత్రమే కాదు.. ఇతర రచనలనూ కరుణానిధి చేశారు. ‘రొమపురి పాండియన్‌’, ‘వొల్లిఝమై’, ‘నొంజుక్కునేది’, ‘ఎనియవై ఎర్బతు’, ‘సంగతమిజ్‌’, ‘కురలోవియం’, ‘పొన్నార్‌-శంకర్‌’, ‘తిరుక్కురల్‌ ఉరై’ వంటి వందకు పైగా రచనలు చేశారు. వీటితో పాటు, ‘మణిమగూడెం’, ‘ఒరే రత్తం’, ‘పళనియప్పన్‌’, ‘తూకుమేడై’, ‘కాగితపూ’, ‘నానే అరివల్లి’, ‘ఉదయ సూరియన్‌’, ‘శిలప్పధికారం’ తదితర రచనలూ ఉన్నాయి.

సాహిత్య, సినిమా రంగంలో ఆయన చేసిన కృషిగానూ ఎన్నో అవార్డులను అందుకున్నారు. కరుణ రాసిన ‘తెన్‌పడి సింగం’కు తంజావూరు తమిళ విశ్వ విద్యాలయం ‘రాజరాజన్‌’ పురస్కారంతో ఆయనను సత్కరించింది. 1971లో అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ అందుకున్నారు. కౌన్సిల్‌ ఆఫ్‌ డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ కరుణకు ‘తమిళవేల్‌’ పురస్కారాన్ని అందించింది.

సినీ రంగం నుంచి రాజకీయాలకు..

1924 జూన్‌ 3న తమిళనాడులోని తిరుక్కువాలైలో ఆయన జన్మించారు. బాల్యంలో ఆయన పేరు దక్షిణామూర్తి. బాల్యంలోనే నాటికల రచన, సాహిత్యంపై మొగ్గుచూపించేవారు. అప్పట్లో జస్టిస్‌పార్టీ నేతృత్వంలో సాంఘిక సంస్కరణ ఉద్యమాలు బలంగా ఉండేవి. వీటి ప్రభావంతో విద్యార్థిగా ఉన్నప్పుడే మరి కొందరు సహచరులతో కలిసి ‘ఆల్‌స్టూడెంట్‌క్లబ్‌’ అనే సంస్థను నెలకొల్పాడు. ద్రవిడ ఉద్యమంలో ఇదే తొలి విద్యార్థి సంఘం కావడం గమనార్హం. కల్లుకుడిలో జరిగిన ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. అనంతరం తమిళ సినిమాలకు స్క్రీన్‌ప్లే రాయడం ప్రారంభించారు. ‘పరాశక్తి’ లో సంప్రదాయవాదాన్ని తప్పుబట్టారు. అదే సమయంలో అంటరాని తనం, జమిందారీ వ్యవస్థకు వ్యతిరేకపోరాటం, ఆత్మాభిమానం.. తదితర అంశాలపై ఆయన రాసిన రచనలు సినిమాల్లో అస్త్రాలుగా మారాయి. నాస్తికవాదానికి మద్దతుగా అనేక రచనలు చేసేవారు.

ద్రవిడ ఉద్యమ త్రయం

ద్రవిడ ఉద్యమం అప్పటి సాంఘిక దురాచారాలను నిరసించింది. ఈవీ రామస్వామి పెరియార్‌, అన్నాదురైలతో పాటు కరుణాధి ఈ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 1957లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 33 ఏళ్ల వయస్సులో ఆయన తొలిసారిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2016 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు ఓటమి అన్నది చవిచూడలేదు. ద్రవిడ మున్నేట్ర కళగం స్థాపనలో కీలక భూమిక వహించారు. 1967లో తొలి సారిగా తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చింది. అన్నాదురై సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1969లో కన్నుమూయడంతో కరుణ పగ్గాలు అందుకున్నారు. అనంతరం సినీనటుడు ఎంజీ రామచంద్రన్‌ పార్టీ నుంచి వెళ్లిపోయి అన్నాడీఎంకే పేరుతో కొత్త రాజకీయపక్షాన్ని నెలకొల్పారు. అనంతరం ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘనవిజయం సాధించడంతో సుదీర్ఘకాలం ఆయన ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. ఎంజీఆర్‌ మరణాంతరం జరిగిన ఎన్నికల్లో డీఎంకే మళ్లీ ఘనవిజయం సాధించడంతో సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ఎంజీఆర్‌ తరువాత అన్నాడీఎంకే కార్యదర్శిగా జయలలిత ఎంపికయ్యారు. రెండు పక్షాల మధ్య రాజకీయాలు దేశ దృష్టిని ఆకర్షించేవి. 1957 నుంచి 2016 అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన పోటీచేసిన ప్రతిసారీ విజయం సాధించడం విశేషం.

రాజకీయవ్యూహాల్లో దిట్ట

తమిళ రాజకీయాల్లో ఉద్వేగాలు ఉంటాయి. పరిస్థితులకు అనుగుణంగా ఆయన వ్యూహాలు రచించేవారు. ఒక సారి సార్వత్రిక ఎన్నికల్లో భాజపా హవాను ఆయన ముందే ఊహించారు. వెంటనే చిరకాల మిత్రపక్షం కాంగ్రెస్‌ను వదిలి భాజపాతో సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. అనంతరం భాజపాకు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌కు స్నేహహస్తం అందించారు. పెద్ద పెద్ద రాజకీయ పండితులు కూడా పసిగట్టలేని పరిస్థితులను ఆయన ముందుగానే గుర్తించేవారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏలో కీలక భాగస్వామిగా వ్యవహరించారు. 2009లో తమిళటైగర్లపై శ్రీలంక సైన్యం చేపట్టిన సైనికచర్యను నిరసిస్తూ నిరాహారదీక్షకు దిగడం సంచలనం సృష్టించింది.

ప్రజాకర్షకపథకాలు..

తమిళ రాజకీయాలకు ప్రజాకర్షక పథకాలకు విడదీయని బంధం ఉంది. జనాభాలో ఎక్కువమంది పేదవారు ఉండటంతో వారి సంక్షేమానికి కరుణానిధి పలు ప్రజాకర్షకపథకాలను అమలుచేసేవారు. ఉచిత టీవీల పంపకం ఆయన ప్రవేశపెట్టినదే. ఆయన పథకాల విజయాన్ని గమనించిన జయలలిత కూడా అదే బాటలో నడవడం విశేషం. ఇప్పుడు దేశమంతటా ప్రజాకర్షక పథకాలు అమలవుతున్నాయంటే అందుకు కరుణానిధి ఆద్యుడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తమిళభాషపై అత్యంత ప్రేమాభిమానాలు కలిగిన ఆయన సీఎంగా ఉన్న సమయంలో ప్రపంచ తమిళ మహాసభలు నిర్వహించారు. ఈ సభలకు ఆయన ఒక గీతాన్ని కూడా రచించారు.

రాజకీయ వారసుడిపై స్పష్టత

తన రాజకీయ వారసుడిగా కుమారుడు స్టాలిన్‌ను ప్రకటించారు. దీనిపై ఆయన ఇంకో కుమారుడు అళగిరి వ్యతిరేకత వ్యక్తంచేసినా కరుణ వెనకడుగు వేయలేదు. దేశంలోని సమకాలీన రాజకీయ పరిస్థితులపై ఆయనకు పూర్తి అవగాహన ఉండేది. దాదాపు 60 ఏళ్ల పాటు ద్రవిడ రాజకీయాల్లో వెలుగు వెలిగిన కరుణానిధి లేరంటే నమ్మశక్యం కావడం లేదు. ద్రవిడ నాట ఆయన ఎప్పటికి సూర్యుడే. డా. కళంజర్‌ (కళాకారుడు)గా దేశప్రజలపై చెరగని ముద్రవేసిన కరుణానిధి ఎప్పటికీ మన గుండెల్లో ఉంటారు.

1969లో సీఎన్ అన్నాదురై మరణించినప్పటి నుంచి నేటి వరకు ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కరుణానిధి డీఎంకే పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. తమిళనాడు రాష్ర్టానికి మూడో ముఖ్యమంత్రిగా 1969లో పదవి చేపట్టి- 1971 వరకు, 1971-1974, 1989-1991, 1996-2001, 2006-2011 ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో 13 సార్లు గెలిచి గిన్నీస్ బుక్ రికార్డుకెక్కారు. 2004 ఎన్నికల్లో తమిళనాడులోని 40 లోక్‌సభ స్థానాలకు గాను నలబై గెలిచి యూపీఏ ప్రభుత్వం నెలకొల్పడంలో ప్రధాన పాత్ర పోషించారు. తాను స్వయంగా నాస్తికుడిగా ప్రకటించుకున్నారు. ఈ.వి రామస్వామి నాయకర్ సిద్ధాంతాలను అనుసరించారు. 1971 సంవత్సరంలో అన్నాదురై యునివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నారు.