ద్వంద్వ విధానాల వల్లే నష్టం
ఆదిలాబాద్, నవంబర్ 12 :కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద విధానాల వల్ల ప్రజలు నష్టపోతున్నా రని తెలుగుదేశం నాయకులు, ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్ ఆరోపించారు. ఆర్థిక, సామాజిక రాజకీయంగా వెనుకబడిన మాలి పుర్సలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెండు రకాలుగా మాలి కులస్తులను ప్రభుత్వం గుర్తించడం వల్ల తెలంగాణ ప్రాంతంలో విద్యా, ఉపాధి రంగాలలో మాలి కులస్తులు వెనుకబడి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్రలో మాలిలను ఎస్టీలుగా, తెలంగాణలో బీసీలుగా గుర్తించడం వారి హక్కులను కాలరాయడమేనని అన్నారు. మాలి కులస్తులకు తమ పార్టీ అండగా ఉంటూ వారి హక్కుల కోసం పోరాడుతామని ఆయన అన్నారు. వారి సంఘం భవన నిర్మాణం కోసం ఎంపీ నిధుల నుండి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.