ధరిణితో 15 నిముషాల్లో రిజిస్టేష్రన్,మ్యుటేషన్
దేశంలోనే ఆదర్శంగా ధరణి పోర్టల్
వర్గల్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి హరీష్ రావు
సిద్దిపేట,నవంబర్13(జనంసాక్షి): పదిహేను నిమిషాల వ్యవధిలోనే భూమి అమ్మడం, కొనడం, మ్యూటేషన్ జరగడం, పట్టాదారు పాసు పుస్తకాలు రావడం.. ఇలా పారదర్శకంగా, వేగంగా జరగడం దేశంలోనే ఒక రికార్డు అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గతంలో నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా, కాళ్ల చెప్పులు అరిగినా, అనేక వ్యయ ప్రయాసాలకు లోనైనా భూ మార్పిడి జరగడంలో గానీ, పట్టాదారు పాసు పుస్తకం రావడానికి గానీ రైతులు చాలా కష్టాలు పడాల్సి వచ్చేదన్నారు. ధరణితో ఇప్పుడా సమస్యలు లేరకుండా పోయాయని అన్నారు. ధరణి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఆనిలిచిందన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సమయంలో వేలూరు గ్రామానికి చెందిన వెంకట్ గౌడ్, మాసాయిపేట గ్రామానికి చెందిన శంకర్‌ల మధ్య జరిగే భూ క్రయ విక్రయాన్ని మంత్రి స్వయంగా పరిశీలించారు. 15 నిమిషాల్లోనే ప్రాసెస్ అంతా పూర్తయి మ్యూటేషన్, పట్టాదారు పాసు పుస్తకం కూడా రావడం జరిగింది. ఈ మేరకు రిజిస్టేష్రన్ పత్రాలను మంత్రి చేతుల విూదుగా కొనుగోలుదారుడికి అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. యావత్ దేశం మన తెలంగాణ ను చూసి నేర్చుకునే విధంగా సీఎం కేసీఆర్ ధరణిని తీసుకువచ్చారన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అవినీతి రహిత, స్వచ్ఛమైన, పారదర్శకమైన, వేగవంతంగా పరిపాలన సేవలు అందించాలన్న ఉద్దేశ్యంతో సీఏం ధరణిని ప్రవేశపెట్టారన్నారు. ధరణి ఉద్దేశ్యం రైతులు ఆఫీసుల చుట్టూ తిరగొద్దన్నదే కెసిఆర్ లక్ష్యమని అన్నారు. ఇప్పుడిక విూ సొంత మండలంలోనే 15 నిమిషాలలో మూడు పనులు ఒకేసారి పూర్తి అవుతాయన్నారు. ఎక్కడైతే పెన్నుకు అధికారం ఉంటుందో.. అక్కడ అవినీతికి ఆస్కారం ఉంటుందన్నారు. ఆ అవకాశమే లేకుండా పారదర్శకంగా పద్ధతి ప్రకారం జరిగే పక్రియ ధరణి అని అన్నారు. సిద్ధిపేట జిల్లాలో ఇప్పటివరకు 501 మంది ధరణి రిజిస్టేష్రన్లు చేసుకున్న వారి పేరిట పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకున్నారని తెలిపారు. వ్యవసాయేతర భూముల రిజిస్టేష్రన్లు కూడా త్వరలోనే జరిపేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే విధంగా జిల్లాలో సాదా బైనామాలకు 44 వేల 583 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు. పైసా ఖర్చు లేకుండా, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా వారికి వారి గ్రామాల్లోనే పట్టాదారు పాసు పుస్తకాలు అందించడం జరుగుతుందన్నారు. ఆయన వెంట వంటేరు ప్రతాపరెడ్డి తదితరులు ఉన్నారు.