ధాన్యం మద్దతు ధరలకు కృషి
ఏలూరు,మార్చి26 (జనంసాక్షి) : సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించాలని అధికారులు సూచించారు. తద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చాలని పేర్కొన్నారు. గ్రేడ్ ఏ ధాన్యం రకానికి క్వింటాకు రూ.1400, ముతక రకం (కామన్) ధాన్యం రకానికి క్వింటాకు రూ.1360 గిట్టుబాటు ధర ఇవ్వనున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి డి.శివశంకర్ చెప్పారు. మద్దత ధర పొందటానికి పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలను ఆయన వివరించారు. గతేడాది కేవలం 16 సహకార సంఘాల ద్వారా మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించగా, ఈ సంవత్సరం 106 సంఘాలు వీటిని నిర్వహించేందుకు ముందుకు వచ్చాయన్నారు. ప్రతీ సంఘం నిబద్ధత కలిగిన వ్యక్తులను నియమించి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకుని రైతులకు ఎనలేని సేవలు అందించాలన్నారు. గతేడాది సహకార సంఘాలకు రావాల్సిన సొమ్ములను పౌరసరఫరాల అధికారులు వెంటనే విడుదల చేయిస్తే మరింత పోత్సాహకరంగా ఉంటుందన్నారు .ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, రైతులకు అందించాల్సిన సేవలకు సంబంధించి సహకార సంఘాల ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులకు నిజమైన సేవలు అందించడమే కాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో సంఘాలు మరింత ఆర్థికంగా బలోపేతమవ్వటానికి అవకాశం ఉంటుందన్నారు.