ధోనీ ఇప్పుడే రిటైర్మెంట్‌ ప్రకటించడు

– ఇంగ్లాండ్‌ టీ20 సిరీస్‌లో ధోని వల్లే ఓడామనడం సరికాదు
– బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలక్టర్‌ సందీప్‌ పాటిల్‌
న్యూఢిల్లీ, జులై28(జ‌నం సాక్షి) : భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ ఇప్పుడు రిటైర్మెంట్‌ ప్రకటించడని భారత మాజీ క్రికెటర్‌, బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలక్టర్‌ సందీప్‌ పాటిల్‌ అన్నారు. ఇంగ్లాండ్‌ గడ్డపై టీమిండియా వన్డే సిరీస్‌ ఓడిపోవడానికి కారణం మహంద్ర సింగ్‌ ధోనీనే అని గత కొన్ని రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు మాజీలు ధోనీ ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించే సమయం వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా సందీప్‌ పాటిల్‌ మాట్లాడుతూ.. ఇంగ్లాండ్‌ గడ్డపై భారత్‌ వన్డే సిరీస్‌ ఓటమికి ధోనీని బాధ్యుడిని చేశారు. దీనిపై చాలా విూడియాల్లో కథనాలు కూడా వచ్చాయి. గత 14 ఏళ్లుగా ధోనీ నాకు తెలుసు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి ధోనీ తన కెరీర్‌ ప్రారంభించినప్పటి నుంచి నేను అతన్ని చూస్తున్నాను. ఎంతో దగ్గర్నుంచి అతడ్ని పరిశీలించాను. ఇండియా-ఎ కోచ్‌గా, బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా అతనితో కలిసి పని చేశాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అభిమానులకు ఒకటి మాత్రం చెప్పగలను. ధోనీ ఇప్పుడప్పుడే క్రికెట్‌ను వదలడు. మరికొంత కాలం కొనసాగుతాడు. ఎప్పటి వరకు అనేది మాత్రం చెప్పలేను అని పాటిల్‌ అన్నారు. చాలా మందికి ధోనీ మంచి ఫినిషర్‌, కెప్టెన్‌ కూల్‌ అని మాత్రమే తెలుసు. క్రికెట్‌ గురించి పూర్తిగా అవగాహన ఉన్న వారికి మాత్రమే వికెట్‌ కీపర్‌గా ధోనీ ఎంత చేశాడన్నది అర్థం అవుతోంది. ఫిట్‌నెస్‌, ప్రదర్శనను దృష్టిలో ఉంచుకునే సెలక్టర్లు ఆటగాళ్లను ఎంపిక చేస్తారని మరోసారి స్పష్టం చేస్తున్నా అని చెప్పారు. జట్టు ఎంపికకు ముందు సెలక్టర్లు.. కెప్టెన్‌, కోచ్‌ను తప్పకుండా సంప్రదిస్తారు. జట్టు ఎంపిక చేసే సమయంలో సెలక్టర్ల సొంత పెత్తనం ఏవిూ ఉండదు అని సందీప్‌ పాటిల్‌ వివరించారు.
\