ధోనీ, కోహ్లీలు పరస్పరం గౌరవించుకుంటారు, భయంలేదు: రవిశాస్త్రి
న్యూఢిల్లీ: భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, టెస్ట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిలు ఒకరినొకరు గౌరవించుకుంటారని టీమ్‌ఇండియా డైరెక్టర్ రవిశాస్త్రి తెలిపాడు. వాళ్లిద్దరి నాయకత్వంలో భారత జట్టుకు రానున్నవి మంచి రోజులేనని అభిప్రాయపడ్డాడు. ‘భారత జట్టు కెప్టెన్సీపై స్పష్టత ఉండడం కీలక అంశం. కోహ్లి టెస్టు జట్టు పగ్గాలు అందుకున్నాడు. ధోని వన్డే జట్టును నడిపిస్తాడు. వారు కెప్టెన్సీకి కొత్త కాదు’ పిటిఐకి రాసిన వ్యాసంలో రవిశాస్త్రి చెప్పాడు. ‘ధోనీ, కోహ్లీలు ఇద్దరూ పని భారాన్ని పంచుకుంటారు. పరస్పరం గౌరవించుకుంటారు. ఒకరికి ఒకరు ముప్పుగా భావించరు. ఎవరూ ఇతరుల ప్రయోజనాలను లాక్కోవాలని చూడరు. ఇద్దరి మధ్య వైరుధ్యాలు లేవు. రెండు ఫార్మాట్లలోనూ టాప్-6 ఒకటే. ముందు ముందు జట్టులో అంతా సుహృద్భావ వాతావరణమే ఉంటుంది.’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ధోనీ, కోహ్లీలు పరస్పరం గౌరవించుకుంటారు, భయంలేదు: రవిశాస్త్రి ‘జట్టులో అందరూ పరిస్థితులను బాగా అర్థం చేసుకుంటారు. ఒకరి కోసం ఒకరు నిలబడతారు. సహచరుల విజయాన్ని ఆస్వాదిస్తారు. వీటన్నింటినీ నేను ప్రత్యక్షంగా చూశా’ అని శాస్త్రి చెప్పాడు. భవిష్యత్ గురించి టీమ్‌ఇండియా భయపడాల్సిన పనిలేదని అన్నాడు. కోహ్లి, రహానె, విజయ్, కెఎల్ రాహుల్ ఆస్ట్రేలియాలో చక్కగా ఆడారని, పదేళ్లు జట్టులో కొనసాగే సత్తా వీరిలో ఉందని పేర్కొన్నాడు. వీరంతా భిన్నమైన, ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు అని చెప్పాడు. ‘రెండు దశాబ్దాల తర్వాత నేను మళ్లీ టీమ్‌ఇండియా డ్రెస్సింగ్‌రూమ్‌లో ఉన్నా. ఆట మారిందన్నది నిజమే. కానీ చాలా సంగతులు అప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉన్నాయి. ప్రస్తుతం కుర్రాళ్లు తమ లక్ష్యాల కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎల్లప్పుడూ నాణ్యత, క్రమశిక్షణ, ఫిట్‌నెస్, కొత్త చిట్కాలు తమ వద్ద ఉండాలని కోరుకుంటారు. తాము ఇంకా మెరుగుపడగలమని ఈ కుర్రాళ్లు భావిస్తున్నారు. వీళ్లపై భారత్ ఆధారపడొచ్చు’ అని రవిశాస్త్రి తన వ్యాసంలో పేర్కొన్నాడు.