నగరమంతా నిఘానేత్రాలు

3

– తెలంగాణ పోలీసుల పనితీరు భేష్‌

– టీయూడబ్ల్యూజే మీట్‌ ది ప్రెస్‌లో డీజీపీ అనురాగ్‌ శర్మ

హైదరాబాద్‌,డిసెంబర్‌9(జనంసాక్షి): తెలంగాణ పోలీసుల పనితీరు బాగుందని అభిప్రాయపడ్డారు రాష్ట్ర డిజిపి అనురాగ్‌ శర్మ. అయితే, తమ పని ఎలా ఉందో నిర్ధారించేందుకు థర్డ్‌ పార్టీకి చెందిన 5 టీంలు పనులు చేస్తున్నాయని తెలిపారు. టియుడబ్ల్యుజె అధ్వర్యంలో హైదరాబాద్‌ లోని లకిడీకపూల్‌లో నిర్వహించిన విూట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో తొలిసారి ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్‌ ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలంటే అందరి కృషి అవసరమని అన్నారు. పోలీసుల రిక్రూట్‌ మెంట్‌ లో 5 కే రన్‌ తీసివేయడం అంటే పూర్తిగా ఎత్తివేయడం కాదని డీజీపీ అనురాగ్‌ శర్మ అన్నారు. శారీరక బలం కంటే మానసికంగా నైపుణ్యం అవసరమన్నారు. గురువారం ఓయూలో నిర్వహించ తలపెట్టిన బీఫ్‌ ఫెస్టివల్‌ కు అనుమతి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 690 పోలీస్‌ స్టేషన్స్‌ లో కమ్యూనికేషన్‌ వ్యవస్థను, టెక్నాలజీని వాడుతున్నామని డీజీపీ అనురాగ్‌ శర్మ చెప్పారు. హైదరాబాద్‌ నగరంలో వాడుతున్న టెక్నాలజీ రూరల్‌ ఏరియాకు విస్తరించాల్సి ఉందన్నారు. పోలీస్‌ వాహనాలకు జీపీఎస్‌ సిస్టమ్‌ ద్వారా స్ట్రీమ్‌ లైన్‌ చేయడం, ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు అయినప్పటి నుంచి నేరస్తులు జైలు నుంచి విడుదల అయ్యేంత వరకు డాటా అప్‌ డేట్‌ అయ్యేలా టెక్నాలజీని వాడుతున్నామన్నారు. బెటర్‌ రిపోర్టు, బెటర్‌ యాక్షన్‌ రూపంలో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. డయల్‌ 100ను బలపరుస్తూనే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 112 కాల్‌ సెంటర్‌ ను ప్రతిష్టాత్మకంగా చేపట్టి అంతర్జాతీయంగా పేరు తెచ్చుకునేందుకు తమ వ్యవస్థ పనిచేస్తుందని డిజిపి విశ్వాసం వ్యక్తం చేశారు.హైదరాబాద్‌ లో ట్రాఫిక్‌ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉన్నమాట వాస్తవమేనని, ఇంకా మార్పులు రావాలని డీజీపీ అనురాగ్‌ శర్మ అంగీకరించారు. 350 సిగ్నల్స్‌ వద్ద సి.సి.కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. లక్ష కెమెరాలను అమర్చి, వాటిని కమాండ్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానం చేస్తామన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేయాలంటే భయపడుతున్న స్థాయికి వచ్చారని డిజిపి వెల్లడించారు. స్మార్ట్‌ పోలీసింగ్‌ కోసం వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌ ల ద్వారా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నామని డిజిపి చెప్పారు. మహిళల భద్రత కోసం యాప్‌ లు నిర్వహిస్తున్నామని తెలిపారు. మావోయిస్టులు ప్రజాస్వామ్య వ్యవస్థను వ్యతిరేకిస్తున్నారని డీజీపీ అనురాగ్‌ శర్మ చెప్పారు. వారి పంథాలో కార్యకలాపాలు కొనసాగిస్తే ఊరుకునేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉగ్రవాదులను ఎదుర్కునేందుకు అనుక్షణం అలర్ట్‌ గా ఉన్నామన్నారు. పాత నగరం నుంచి ఆకర్షితులు అవుతున్న యువతకు కౌన్సిలింగ్‌ తో చెక్‌ పెడుతున్నామన్నారు. పోలీసుల అవినీతిపై ప్రజలు ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. కరీంనగర్‌ లో ఎఎస్సై మోహన్‌ రెడ్డి ఫైనాన్స్‌ బిజినెస్‌ కేసులో ఎవరిని వదలిపెట్టేది తేల్చిచెప్పారు. తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారని హెచ్చరించారు.  నక్సల్స్‌ విషయంలో తమ విధానం మారలేదని తెలంగాణ డీజీపీ అనురాగ్‌ శర్మ స్పష్టం చేశారు. నక్సల్స్‌  పట్ల గతంలో ఉన్న వైఖరి మేరకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎవరుకూడా శాంతిభద్రతలకు అతీతులు కారని అన్నారు. బుధవారం విూడియాతో మాట్లాడిన ఆయన అత్యాధునిక టెక్నాలజీ తో పోలీసు శాఖకు కొత్త హంగులను జత చేస్తామని తెలిపారు. ఎఫ్‌ఆర్‌ఐ తో సహా అన్నీ ఆన్‌ లైన్‌ చేస్తామని చెప్పారు. మరో వైపు పోలీస్‌ రిక్రూట్‌ మెంట్‌ లో తరచూ వివాదాస్పదమైతున్న 5కే రన్‌ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసు ఉద్యోగాల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్‌ కు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. మహిళల భద్రతకు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నామన్నారు. ఇకపోతే పోలీస్‌ స్టేషన్ల నిర్వహణ భారం తగ్గడంతో పోలీసులు కూడా నిజాయితీగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం వీటి నిర్వహణకు పోలీస్‌ స్టేషన్‌ను బట్టి నిధులు విడుదల చేస్తోందని అన్నారు. దీంతో స్టేషన్లు పటిష్టంగా నడుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు నాయకులు దేవులపల్లి అమర్‌, శ్రీనివాస రెడ్డి, విరాహత్‌ అలీ, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.