నగరవాసులకు చుక్కలు చూపిస్తున్న ట్రాన్స్‌కో అధికారులు
వరుసగా ఈదురుగాలులు, రాళ్లవానతో విద్యుత్ కోతలు
సాంకేతికత పెరుగుతున్నా అప్‌డేట్ కాని ట్రాన్స్‌కో
కరీంనగర్, మే 4 (జనంసాక్షి): వేసవి కాలం వస్తుందనేది ప్రతి సంవత్సరం ముందుగానే ఇటు వివిదశాఖలతోపాటు, ప్రజలకు ప్రధానంగా ట్రాన్స్‌కో అధికారులకు ముందే తెలిసినా కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతుండడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందుల పాలు కావాల్సిన దుస్తితి నెలకొంటోంది. ఎలాంటి ఉపద్రవం వచ్చినా కూడా క్షణాల్లో కనీసం నిమిషాల్లో లేదా గంటల్లో పరిష్కరించే స్థాయిలో సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికి కూడా ట్రాన్స్‌కో సిబ్బంది మాత్రం ఇందుకు పూర్తి బిన్నంగా వ్యవహరిస్తున్న వైనం గత శనివారం నుంచి నగర వాసులకు రుచిచూపిస్తున్నారు. నిరంతరం ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వంగాని, ట్రాన్స్‌కో అధికారులు గాని వరుసగా శనివారం నుంచి నిన్నటివరకు మంగళవారం రాత్రి వరకు కూడా నగర కేంద్రంలో సాక్షాత్తూ కలెక్టరేట్ కార్యాలయం, ఎస్పీ, డీఎస్పీ, కార్యాలయాలతోపాటు, కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ప్రాంతాల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించడంలో అధికారులు వరుసగా విఫలం అవుతున్నారంటే ఆశాఖ సిబ్బందికి విద్యుక్త దర్మం నిర్వహణలో ఏపాటి చిత్తశుద్ది ఉందో అర్థం చేసుకోవచ్చు. గత నాలుగు రోజులుగా నగరంలో మద్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4-5 గంటల మద్య కురుస్తున్న అకాల వర్షం, ఈదురుగాలుల వల్ల సమస్య ఉత్పన్నం అవుతుండడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. ఈదురుగాలులు తగ్గిపోయినా, వర్షం నిలిచిపోయిన తర్వాత కూడా సమస్యను మాత్రం పరిష్కరించేందుకు పూటలకు పూటలు సమయం తీసుకుంటూ తెలంగాణా విద్యుత్ శాఖకున్న మంచి చరిత్రను మచ్చ తెచ్చుకుంటున్నారు. నిత్యం వేలాది మంది ప్రజలు సుదూర ప్రాంతాలనుంచి జిల్లా కేంద్రానికి వచ్చి కలెక్టరేట్ కార్యాలయంలోనే వెలసి ఉన్న 42శాఖలలో పని చేయించుకుంటుంటారు. వీరికి విద్యుత్ నిలిచిపోవడంతో సమయంలో పనులు కాక రోజుల తరబడి జిల్లా కేంద్రంలోనే వ్యయాన్ని భరించుకుని బస చేసి పనులు చేయించుకోవాల్సిన దుస్తితిని కల్పిస్తున్నారు. నిత్యం జిల్లాకేంద్రానికి విఐపీలు, అధికారులు రావడం పోవడం, ఇతర ప్రాంతాలకు వెల్లే మార్గంలో జిల్లాకేంద్రంలో బస చేయడం ఆనవాయితీగా వస్తోంది. నగరం విస్తరిస్తున్నందుకు సంతోషించాలో…లేక విద్యుత్ శాఖ చేస్తున్న నిర్లక్ష్యానికి ఏడవాలో తెలియని పరిస్థితిని ప్రజలకు విద్యుత్ అధికారులు రుచిచూపిస్తున్నారు. ప్రతి రోజు వరుసగా ఇదే తంతు కొనసాగుతుండడం దారుణం. ఇబ్బడి ముబ్బడిగా చార్జీలు పెంచుతున్నా…సర్‌చార్జీలు వేస్తున్నా కూడా నోరు తెరువకుండా చెల్లిస్తున్న వినియోగదారులకు ప్రధానంగా నగర వాసులకు దైర్బాగ్యమైన సేవలు అందిస్తుండడంతో శాఖపై విమర్శల వాన కురుస్తోంది. ఓవైపు ఎండ వేడిమి వల్ల ఉక్కపోతను తట్టుకోలేకపోతున్న ప్రజలు ఏసీలు, కూలర్‌ల వినియోగంవైపు
మారుతున్నారు. ఈక్రమంలో వరుసగా కురుస్తున్న అకాలవ ర్షాలు, ఈదురుగాలులకు తట్టుకోలేక పోతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోతుండడంతో అటు వృద్దులు, చిన్నారులు, తట్టుకోలేక పోతున్నారు. వర్షం కూడా ఓమోస్తరుగానే కురిసి మాయం అవుతున్నా విద్యుత్ సరఫరా మాత్రం పునరుద్దరణకు గంటల కొద్ది సమయం తీసుకుంటున్నారు. శని, ఆది, సోమవారాలకంటే కూడా మంగళవారం అయితే మరీ దారుణంగా ప్రజలకు చుక్కలు చూపించారు ట్రాన్స్‌కో అధికారులు. మంగళవారం మద్యాహ్నం మూడుగంటలకు విద్యుత్ కోత వేశారంటే రాత్రి 10 గంటలవరకు కూడా కొనసాగింది. రాత్రి కూడా మరీ చుక్కలు చూపించినపని చేశారు. 10 గంటలకు వచ్చిందని సంతోషిస్తున్న సందర్బంలో మల్లీ మల్లీ అరగంటకోసారి అర్దరాత్రి దాటాక 1 గంట వరకు కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కల్పిస్తూనే ఉన్నారు. సమస్యను పరిష్కరించి ప్రజలకు అందునా జిల్లా కేంద్రంలో ఉండే ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతనిధులకు,. కలెక్టర్, ఎస్పీ తదితర విభాగాల అదిపతులకు విద్యుత్ శాఖ నాటి బ్రిటీష్ కాలంనాటి రోజులకు తిరిగి గుర్తు చేసిందని చెప్పవచ్చు. విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు గత నాలుగైదు రోజులుగా చూపిస్తున్న ఇక్కట్లు గత నాలుగు దశాబ్దాల్లో కూడా ఏనాడు అనుభవించలేదని సీనియర్ సిటిజన్స్ అంటున్నారు. ఏది ఏమైనా నగర వాసులకు మాత్రం గతంలో చిమ్మం చీకట్లను మరోసారి ట్రాన్స్‌కో అధికారులు రుచి చూపిస్తుండడంతో తిట్ల దండకం అందుకుంటున్నారు. వివిద రకాల విధుల్లో ఉండేవారికి నిప్పుల కుంపటిగా ఈ విద్యుత్ కోతలు పుండు విూద కారం చల్లినట్లుగానే అవుతున్నాయి. ఒక్క విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నగర జనం మాత్రం కోలుకోలేని సమస్యలను అనుభవిస్తున్నారు.