నటుడు దారాసింగ్‌ కన్నుమూత

ముంబయి, జూలై 12 : నటుడు దారాసింగ్‌ (84) కన్నుమూశారు. మెదడుకు సంబంధించిన వ్యాధితో చికిత్స నిమిత్తం స్తానిక కోకిలాబెన్‌ ఆసుపత్రిలో ఈ నెల 7వ తేదీన చేరిన విషయం తెలిసిందే. నాటి నుంచి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తునే ఉన్నారు. మూత్రపిండాలు, మెదడు సహకరించక పోవడంతో బుధవారంనాడు ఆయన ఆరోగ్య పరిస్తితి విషమంగా ఉందని, మూత్రపిండాలు పనిచేయడం లేదని, మెదడు సహకరించడం లేదని, కోమాలో ఉన్నారని వైద్యులు చెప్పడంతో ఇంటికి తరలించామని దారాసింగ్‌ కుమారుడు వినోద్‌సింగ్‌ చెప్పారు. కోమాలోనే గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారని చెప్పారు. ఇదిలా ఉండగా దారాసింగ్‌ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 1928లో జన్మించారు. దారాసింగ్‌ తన చిన్నతనంలోనే పహిల్వాన్‌ శిక్షణ పొందారు. పహిల్వాన్‌గా అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. కింగ్‌కాంగ్‌లో ఓరియంటల్‌ చాంపియన్‌, 1959లో కామన్‌వెల్త్‌ చాంపియన్‌, 1968లో ప్రపంచ చాంపియన్‌గా రికార్డు సృష్టించారు. అలాగే దారాసింగ్‌ 1962లో చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆయన పలు చిత్రాల్లో నటించారు. హాలీవుడ్‌ సినిమాల్లో సైతం అనేక వేషాలు వేశారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు రామానందసాగర్‌ రూపొందించిన రామాయణ్‌ సీరియల్‌లో హనుమంతునిగా ఆయన అభినయించిన తీరు ప్రజల్లో నేటికీ చిరస్థాయిగా నిలిచిపోయింది. 2007లో జాబ్‌ ఉయ్‌ మెట్‌ ఆయన నటించిన చివరి సినిమా. దారాసింగ్‌ 2003 నుంచి 2007 వరకు రాజ్యసభ సభ్యునిగా కూడా దేశానికి సేవలందించారు.