నమ్మించి మోసం చేసిన బిజెపి

తిరుపతి హావిూలను విస్మరించిన మోడీ

నెల్లూరు ధర్మపోరాట దీక్షలో బాబు

నెల్లూరు,నవంబర్‌20(జ‌నంసాక్షి): బీజేపీ నమ్మించి మోసం చేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క ఓటు కూడా పడదని ఆయన అన్నారు. మంగళవారం నెల్లూరులో స్థానిక ఎస్వీజీఎస్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో టీడీపీ ధర్మపోరాట దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా జరుపుకోలేకపోతున్నామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు నరేంద్రమోదీ ప్రసంగం వీడియోను సభలో ప్రదర్శించారు. తిరుపతి వెంకన్న సాక్షిగా

ఇచ్చిన హావిూలను మోదీ విస్మరించారని బాబు దుయ్యబట్టారు.ప్రధాని మట్టి, నీళ్లు తెచ్చారని చాలా మంది విమర్శించారని, అమరావతి శంకుస్థాన సభలోనూ హావిూలు ఇచ్చి మోసం చేశారని చంద్రబాబు విమర్శించారు. పోలవరంపై మోసం చేస్తారని తెలిసే ముంపు మండలాలపై పట్టుబట్టామన్నారు. రూ. 16వేల కోట్లకు పైగా ఏపీ లోటు బడ్జెట్‌ ఉంటే కేవలం రూ. 3,900 కోట్లు ఇచ్చి ఎగనామం పెట్టారని సీఎం మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి ఇచ్చింది కేవలం రూ.1600 కోట్లేనని, వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన డబ్బులు ఎందుకు వెనక్కి తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పి తీరాల్సిందేనని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదేనని అన్నారు. హైదరాబాద్‌లో ఓఆర్‌ఆర్‌, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మించామన్నారు.

పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలను ప్రధాని మోదీ బెదిరించారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కుట్రలో భాగంలోనే టీడీపీ నేతలపై ఐటీ పేరుతో దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. దాడులతో తమ మనోనిబ్బరాన్ని దెబ్బతీయలేరని అన్నారు. ఎంత అణిచివేస్తే అంతగా ఎగిసిపడతామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు దేశమంతా తిరుగుతున్నామని, బీజేపీపై యుద్ధం ప్రకటించామని, ఈ దేశాన్ని కాపాడుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. హావిూలు అడిగితే తనకు మెచ్యురిటీ లేదని, కేసీఆర్‌కు ఉందని మోదీ అన్నారని బాబు విమర్శించారు. కేసీఆర్‌ను తాను అన్ని విధాలా ప్రోత్సహించానని అన్నారు. వైసీపీ ఉచ్చులో పడింది బీజేపీనేనని..లాలూచీ రాజకీయాలు తాను చేయనని సీఎం స్పష్టం చేశారు. జగన్‌, కేసీఆర్‌తో కుట్ర పన్ని టీడీపీని దెబ్బతీయాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున సభకు ప్రజలు హాజరయ్యారు.

భ్రష్టుపట్టిన సిబిఐ: సోమిరెడ్డి

మనీష్‌కుమార్‌ సిన్హా సీబీఐ బండారాన్ని బయటపెట్టారని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. తక్షణమే పార్ధివ్‌ భాయ్‌ చౌదరిని కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ సీబీఐ భ్రష్టుపట్టిపోయి పరువు

పోగొట్టుకుందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీబీఐకి ఏపీలో అనుమతి ఉపసంహరించామని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంపై ఆర్బీఐ గవర్నర్‌ విమర్శలు చేసే పరిస్థితి వచ్చిందని, మోదీ, అమిత్‌షా రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టించారని సోమిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. మోదీ అవినీతి, నియంతృత్వ పాలనపై పోరాడాలని మంత్రి పిలుపు ఇచ్చారు. చంద్రబాబు జాతీయ నేతలందరినీ ఒకే వేదికపై తీసుకొస్తున్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు.