నరేగాలో ఏపీకి 10అవార్డులు రావడం..
గర్వకారణం
– ఏటికేడు రెట్టింపు అవార్డులు.. రెట్టింపు ప్రగతికి నిదర్శనం
– వర్షం పడినా.. పడకున్నా.. పంటల దిగుబడి తగ్గకుండా చూడాలి
– ఉద్యానవన పంటల విస్తీర్ణం కోటి ఎకరాలకు తీసుకెళ్లాలి
– కరవు మండలాల్లో నరేగా పనులను ముమ్మరం చేయండి
– ఏ సమస్య లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుకోవాలి
– టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులకు సూచించిన ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి, సెప్టెంబర్3(జనం సాక్షి) : నరేగాలో ఏపీకి 10 అవార్డులు రావడం గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏటికేడు రెట్టింపు అవార్డులు, రెట్టింపు ప్రగతికి నిదర్శనమని తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనం, ఉపాధి హావిూ అనుసంధానం, సుపరిపాలన, ఎక్కువ పనులు చేయడంలో అవార్డులు వచ్చాయని సీఎం పేర్కొన్నారు. వర్షపు నీటిని భూగర్భజలంగా మార్చే బృహత్తర కార్యక్రమం చేపట్టామన్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో తీవ్ర వర్షాభావం ఉందని తెలిపారు. 86 రిజర్వాయర్లలో 67శాతం నీరు చేరడం సంతోషంగా ఉందని బాబు హర్షం వ్యక్తం చేశారు. 40వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమకు ఎత్తిపోస్తున్నామన్నారు. సోమశిల, కండలేరు జలాశయాలకు నీటిని తీసుకెళ్తున్నామని తెలిపారు. ‘నాలుగేళ్ల జల సంరక్షణ చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని, నాలుగేళ్ల మనందరి కష్టార్జితం ఇది అని సీఎం పేర్కొన్నారు. వర్షం పడినా, పడకున్నా పంట దిగుబడులు తగ్గకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఉద్యాన పంటల విస్తీర్ణం కోటి ఎకరాలకు తీసుకెళ్లాలని సూచించారు.
ఏపీలో 2 కోట్ల ఎకరాల్లో సాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. ఏ సమస్య లేని రాష్ట్రంగా ఆంధప్రదేశ్ రూపొందాలని చంద్రబాబు ఆకాంక్షించారు. భూగర్భ, ఉపరితల జలాలు, వర్షపు నీరు సమర్ధ నిర్వహణ జరగాలన్నారు. వర్షాలు లేని చోట అన్ని చెరువులను నీటితో నింపాలని, రెయిన్ గన్స్ ద్వారా పంటలు ఎండకుండా కాపాడాలని ఆదేశించారు. అలాగే కరవు వచ్చినా, వరదలు వచ్చినా నీటి సమర్ధ నిర్వహణ జరగాలన్నారు. విపత్తులలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కరవు మండలాల్లో నరేగా పనులను ముమ్మరం చేయాలని, ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు పంపిణీ చేయాలని సూచించారు. కౌలురైతులకు పంటరుణాలు అందించడంలో బ్యాంకర్లను ప్రోత్సహించాలన్నారు. నాణ్యమైన ఉల్లికి తగిన ధర వచ్చేలా చూడాలని తెలిపారు. సరైన ధరకు రైతుల వద్ద ఉల్లిని కొనుగోలు చేయాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని, మలేరియా, డెంగీ ప్రబలుతున్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలని, అలాగే ఆయా ప్రాంతాలలో పారిశుధ్యం మెరుగుపరచాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.