నల్లకుభేరులపై కేజ్రీవాల్
న్యూఢిల్లీ, నవంబర్ 9 (జనంసాక్షి):
అవినీతిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న సామాజిక ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ మరో అవినీతి బాంబు పేల్చారు. ప్రముఖుల అవినీతిని బట్టబయలు చేస్తున్న ఆయన.. శుక్రవారం మరికొందరు పేర్లను బయటపెట్టారు. పోయినసారి ధరల పెరుగుదలకు కారణమవుతున్న వారి గుట్టు విప్పిన కేజ్రీవాల్ ఈసారి నల్ల కుబేరుల బండారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. ఇప్ప టికే సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా, కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్, బీజేపీ అధ్య క్షుడు నితిన్ గడ్కారీ, కార్పొరేట్ దిగ్గజం ముకేశ్ అంబానీల అవినీతిని బయటపెట్టిన ఇండియా అగెనెస్ట్
కరప్షన్ సభ్యుడు.. తాజాగా మరిన్ని పేర్లను బయటపెట్టారు. రాజకీయాల్లో, కార్పొరేట్ వర్గాల్లో తెల్ల ఏనుగులుగా చెలామణి అవుతున్న వారి నల్ల సొమ్ము వివరాలను వెల్లడించారు.
నల్లధనాన్ని స్విస్‌బ్యాంకుకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. కేంద్రం వద్ద నల్లధనానికి సంబంధించిన జాబితా ఉన్నా.. ప్రభుత్వం బ్లాక్‌మనీని వెనక్కు తెప్పించే ప్రయత్నం చేయించడం లేదని విమర్శించారు. స్విస్‌బ్యాంకుతో పాటు జెనీవాలోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో 700 మందికి ఖాతాలు ఉన్నాయని, ఆ వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నా చర్యలు చేపట్టడం లేదని దుయ్యబట్టారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ సంచలన విషయాలు వెల్లడించారు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లడబ్బుపై చర్చ జరుగుతోంది కానీ, వెనక్కి తెప్పించే ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. పాలకులు అవినీతిపై మాట్లాడతారు గానీ, ఎలాంటి చర్యలు తీసుకోరన్నారు.
స్విస్ బ్యాంకుల్లో నల్లడబ్బు దాచిన వారి పేర్ల జాబితాను బయటపెట్టారు. హెచ్‌ఎస్‌బీసీలో ఖాతాలున్న 700 మంది భారతీయుల జాబితా తమ వద్ద ఉందన్నారు. దీన్ని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తమకు ఇచ్చారని చెప్పారు. ఈ జాబితా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న నల్ల కుబేరులపై చర్యలు తీసుకోవడంలో, నల్లధనాన్ని వెనక్కు తెప్పించడంలో చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ‘జెనివా హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో ఖాతాలు ఉన్న వారిని వివరాలతో కేంద్ర ప్రభుత్వం జూలై 2011లో జాబితా రూపొందించింది. ఈ జాబితాలో 2006 నాటి నగదు నిల్వల వివరాలున్నాయి’ అని చెప్పారు.
స్విస్‌బ్యాంకుల్లో మొత్తం రూ.25 లక్షల నల్లధనం ఉందని సీబీఐ తేల్చిచెప్పిందని కేజ్రీవాల్ తెలిపారు. 700 మంది నల్ల కుబేరులు మొత్తం రూ. 6 వేల కోట్లను విదేశీ బ్యాంకుల్లో దాచి పెట్టారని చెప్పారు. హెచ్‌ఎస్‌బీసీ
బ్యాంక్ నల్లధనాన్ని ఎగుమతి చేసేందుకు సాయం చేస్తోందని ఆరోపించారు. రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ, నరేశ్ గోయాల్, డాబర్, బిర్లా గ్రూప్ సహా అనేక మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలకు స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్నాయని వెల్లడించారు. చివరకు రాహుల్ గాంధీ అనుచరులైన కాంగ్రెస్ ఎంపీ
అనుటాండన్, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి సందీప్ టాండన్‌లకు కూడా ఖాతాలున్నాయని చెప్పారు. రిలయన్స్ రూ.125 కోట్ల నల్లధనాన్ని స్విస్ బ్యాంకులో దాచిందని చెప్పారు. రిలయన్స్ సోదరులు ముఖేశ్ అంబానీ రూ.100 కోట్లు, అనిల్ అంబానీ రూ.100 కోట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.500 కోట్లు, రిలయన్స్ గ్రూప్‌కు చెందిన మోటెక్ సాఫ్ట్‌వేర్ కంపెనీ రూ.2,100 కోట్ల నల్లధనాన్ని దాచాయన్నారు. ధీరుబాయి అంబానీ భార్య కోకిల్‌బెన్‌కు కూడా స్విస్ బ్యాంకులో ఖాతా ఉందని, అయితే, అందులో నగదు నిల్వలు లేవన్నారు.ఉ అలాగే, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి, సందీప్ టాండన్ రూ.125, కాంగ్రెస్ ఎంపీ అను టాండన్ రూ.125 కోట్లు, జెట్ ఎయిర్‌వేస్ అధినేత నరేశ్ కుమార్ గోయల్ రూ.80 కోట్లు దాచారని వెల్లడించారు. ఏవీ బిర్లాకు కూడా స్విస్ బ్యాంకులో అకౌంట్ ఉందన్నారు.
స్విస్ బ్యాంకులో ఖాతా తెరవడం చాలా సులువని, విూ ఇంటి వద్దకే వచ్చి ఖాతా తెరుస్తారని కేజ్రీవాల్ చెప్పారు. స్విస్ బ్యాంకు దళారీలు దేశమంతటా ఉన్నారన్నారు. చాలా మందికి స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయని తెలిసీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎందుకు దాడులు చేయారని ప్రశ్నించారు. దేశంలో హవాలా వ్యాపారం జోరుగా సాగుతోందని చెప్పారు. ప్రభుత్వమే నల్లధనాన్ని ఎగుమతి చేసేందుకు ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. అవినీతిపై పోరాటం చేస్తున్న తనకు కాంగ్రెస్ నేతల నుంచి సహకారం ఉందని చెప్పారు. నల్ల కుబేరుల జాబితాను ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు ఇచ్చారని, సోనియా అల్లుడు వాద్రాపై దాడి కొనసాగించాలని స్వయంగా కేంద్ర మంత్రి ఒకరు తనతో చెప్పారని తెలిపారు.